సరిపడా యూరియా అందించని సర్కార్‌పై యువరైతు కన్నెర్రజేశాడు. రెండు యూరియా బస్తాలపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరు 20 నుంచి 30 బస్తాలు తీసుకెళ్లారని, వారం నుంచీ ఎదురుచూస్తున్నా.. తనకు రెండు బస్తాలే ఇచ్చారని మండిపడుతూ మంత్రి సీతక్క నియోజకవర్గమైన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్‌లో రైతు గూడెల్లి హరీశ్ శనివారం ఇలా యూరియా బస్తాలు కాలబెట్టి నిరసన తెలిపాడు.
ములుగు, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రైతులకు సరిపడా యూరియా అందించకుండా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహించిన ఓ రైతు రెండు యూరియా బస్తాలపై పెట్రోల్‌పోసి నిప్పటించాడు. ఈ ఘటన మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లా దేవనగర్‌లో శనివారం జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. దేవనగర్‌కు చెందిన రైతు గూడెల్లి హరీశ్‌కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. యాసంగిలో రెండున్నర ఎకరాల్లో మక్క వేశాడు. వారం క్రితం ములుగు సొసైటీ నుంచి గ్రామానికి 430 బస్తాల యూరియా వచ్చింది.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు 20-30 బస్తాలను, కొందరు ఐదు బస్తాల చొప్పున తీసుకెళ్లారు. లోడ్ లారీని బతుకమ్మ సెంటర్ వద్ద నిలిపి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తీసుకెళ్లారు. హరీశ్ యూరియా కోసం వెళ్తే అప్పటికే అయిపోయిందని సొసైటీకి చెందిన వ్యక్తి తెలిపాడు. మరో లారీ లోడ్ వస్తుందని చెప్పాడు. శనివారం లారీ లోడ్ వచ్చింది. యూరియా కోసం వెళ్తే.. ఆధార్ కార్డు, జిరాక్స్ తీసుకుని ఒక్కరికి రెండు బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు. తనకు రెండు బస్తాలు సరిపోదని, వారం క్రితం ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టు బస్తాలను ఎలా తీసుకున్నారని, ఇప్పుడు అవసరమున్నంత వరకు ఎందుకు ఇవ్వరని హరీశ్ ప్రశ్నించాడు.
వారం క్రితం కొందరు వ్యక్తులు రూ.40 వేల నుంచి రూ.50 వేలు వెచ్చించి యూరియాను తెప్పించుకున్నారని సొసైటీకి చెందిన వ్యక్తి సమాధానమిచ్చాడు. గ్రామంలోని మరికొందరికీ ఇష్టానుసారంగా ఎలా పంపిణీ చేశారని నిలదీశాడు. అయినా రెండు బస్తాల యూరియాను మాత్రమే ఇవ్వడంతో తన పంటకు సరిపోదనే మనస్తాపంతో రోడ్డుపై రెండు యూరియా బస్తాలు ఉంచి పెట్రోల్ పోసి తగులపెట్టాడు. రైతులకు సరిపడా యూరియా అందించడం లేదని, ఇందులో రాజకీయ జోక్యం ఉన్నదని ఆరోపించాడు. తాను కాంగ్రెస్ పార్టీ అభిమానినేని వాపోయాడు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు అవసరమైన మేరకు యూరియా అందించాలని వేడుకున్నాడు.