నెన్నెల, జూన్ 16 : నెల రోజులైనా పంట కొనకపోవడంతో కడుపు మండిన రైతులు ఆందోళనకు దిగితే వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు పిలిచేంత వరకు కేసులు నమోదైన విషయం తెలియకపోవడం గమనార్హం. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన సుమారు 20 మంది రైతులు మే 20న ఉదయం 11 గంటలకు మైలారం రోడ్డుపై ధాన్యం బస్తాలు అడ్డుపెట్టి ఆందోళనకు దిగారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచన అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో నెన్నెల ఎస్సై రామకృష్ణ, బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. లారీలు వచ్చేలా చూస్తామని రైతులను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు.
అదే రోజు నెన్నెల పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజు బ్లూకోల్ట్స్ విధి నిర్వహణలో భాగంగా గొల్లపల్లి రైతులు ధర్నా చేసిన స్థలానికి చేరుకున్నాడు. రైతులు మూడున్నర గంటలు ఆందోళన చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని ఆయన అదే రోజు ఆరుగురు రైతులపై నెన్నెల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని చింత పురుషోత్తం, జాడి నారాయణ, గడ్డం తిరుపతి గౌడ్, చింత సురేశ్, ఇందూరి రమేశ్, వేల్పుల మొగిలి అనే రైతులపై ఫిర్యాదు చేశాడు. వీరిపై క్రైమ్ నంబర్ 48/2006 యూఎల్ఎస్ఈఈ 126(2), 221, 292 సెక్షన్ల కింద 8/190 బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా చింత సురేశ్ అనే రైతు ఆందోళన సమయంలో లేడు. అయినప్పటికీ అతనిపై కేసు నమోదు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కోర్టుతోపాటు మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు రైతులు తెలిపారు.