Telangana | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఇంటెలిజెన్స్ నిద్రమత్తు వదలడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలో రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఆ విషయాన్ని సీఎంకు ఉప్పందించడంలో ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫార్మా కంపెనీలను కొన్ని నెలలుగా రైతులు వ్యతిరేకిస్తున్నా ఆ అంశంలోని సున్నితత్వాన్ని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్‌తోపాటు కడా ప్రత్యేకాధికారి పర్యటిస్తారని తెలిసి కూడా.. రైతుల ఆందోళనను పసిగట్టలేకపోయింది.
ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు బీఆర్ఎస్లోని ముఖ్యనేతలు, కాంగ్రెస్‌లోని అసమ్మతి నేతల ఫోన్లను ట్యాప్ చేయడంలోనే ఇంటెలిజెన్స్ బిజీగా ఉన్నట్టు సమాచారం. ప్రజా ఆందోళనలు, ఉగ్రకదలికలను పసిగట్టలేకపోయింది. ఓ ఉగ్రవాది హైదరాబాద్‌లో ఆరునెలలు తలదాచుకున్నా.. అతని ఉనికిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది. ఢిల్లీ నుంచి ఎన్ఐఏ అధికారులొచ్చి అతన్ని అరెస్టు చేసేవరకూ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం చేష్టలుడిగి చూసింది.
11 నెలల కాంగ్రెస్ పాలనలో 9చోట్ల మత ఘర్షణలకు బీజం పడటం చూస్తే.. మున్ముందు రాష్ట్రం రావణకాష్టంగా రగిలిపోతుందేమోనని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. భైంసా, పాతబస్తీ, మెదక్, బోడుప్పల్లో ఘర్షణలు కలవరపెట్టాయి. మెదక్ మతఘర్షణల్లో నిర్లక్ష్యం వహించిన మెదక్ టౌన్, రూరల్ స్టేషన్ల సీఐలను నాటి ఐజీ రంగనాథ్ డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటనలో ఓ వర్గానికి చెందిన 151 మంది యువకులు సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో 59 గదుల్లో మకాం వేయడం విస్మయానికి గురిచేసింది.
జూన్‌లో మియాపూర్‌లోని హెచ్ఎండీఏ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలు పంచుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరలైంది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం పోటెత్తిరాగా లాఠీచార్జి వరకు వెళ్లింది. చిలకలగూడ, ఉప్పల్, మేడ్చల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు గ్యాంగులు వచ్చాయని ఆలస్యంగా గుర్తించింది. ఇటీవల నగరంలోని ఆసిఫ్‌నగర్‌లో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే వరుసగా మూడు హత్యలు జరిగాయి. ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం లేకపోవడం గమనార్హం.
గ్రూప్-1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు అక్టోబర్ రెండోవారంలో అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి క్యాండిళ్లతో నిరసన వ్యక్తం చేసినా ఇంటెలిజెన్స్ విభాగం పసిగట్టలేదు. వారంతా సెక్రటేరియట్‌ను ముట్టడిస్తారని తెలిసి అభ్యర్థుల రూముల్లోకి చొచ్చుకెళ్లి.. వ్యాన్లలోకి ఈడ్చిపడేశారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్లెక్కి నిరసన తెలిపారు. కుటుంబాలతో సచివాలయాన్ని ముట్టడించారు. వారి పోరాటం నుంచి కూడా పాఠం నేర్చుకోకపోవడంతో హోంగార్డులు ఆందోళన బాటపట్టారు. వారు కూడా కుటుంబాలతో సచివాలయం ముట్టడికి యత్నించడంతో.. అప్పటికి తేరుకొని జిల్లాల సరిహద్దుల్లోనే నిలువరించారు.