కాశీబుగ్గ/ఖమ్మం వ్యవసాయం, మార్చి 16 : మిర్చి ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు సంబురపడుతున్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.23,500 పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. సీజన్ ప్రారంభం నుంచే అన్ని రకాల మిర్చికి ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. గురువారం మార్కెట్కు అన్ని రకాల మిర్చి సుమారు 50 వేల బస్తాలు వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
కాగా ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్కు గురువారం 26 వేల బస్తాల మిర్చి వచ్చింది. అనంతరం జరిగిన జెండాపాటలో క్వింటాల్ గరిష్ఠ ధర రూ.23 వేలు పలుకడంతో రైతులు సంబురపడ్డారు. మధ్య ధర రూ.20,900 కాగా, కనిష్ఠ ధర రూ.18,300 చొప్పున వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. రాబోయే కొద్దిరోజుల్లోనే యార్డులో క్వింటాల్ ధర రూ.25 వేలకు చేరే అవకాశం ఉన్నదని మార్కెట్ కమిటీ వ్యాపారులు పేర్కొంటున్నారు.