పత్తి కొనుగోలు చేయనందుకు నిరసనగా మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల రైతులు బెల్లంపల్లిలోని శ్రీరామ జిన్నింగ్ మిల్లు వద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల వారం నుంచి పడిగాపులు కాస్తున్నామని, వాహనాల కిరాయి భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరులోని విశాల సహకార పరపతి సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. మానకొండూరు, ముంజంపల్లి, జగ్గయ్యపల్లి రైతులు సాయంత్రం 5 వరకు పడిగాపులు కాచారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అదనపు వసూళ్లపై అసహనం వ్యక్తంచేశారు.
వనపర్తి జిల్లా పాన్గల్ మండలం అన్నారంలో పంటలకు నీళ్లివ్వాలని రైతులు రోడ్డుపై ధర్నా చేశారు. ఎంజీకేఎల్ఐ డిస్ట్రిబ్యూటరీ-8, మేజర్ కాల్వ-4 నుంచి పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాల్వల్లో పేరుకుపోయిన పూడిక తీయాలని, లింక్ కాల్వల పనులు పూర్తి చేయాలని కోరారు. గంటన్నరపాటు ఆందోళన కొనసాగడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.