హైదరాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): ‘ఒక్క సంవత్సరం మేం కడుపుకట్టుకుని పని చేస్తే.. రైతులకు చెల్లించాల్సిన 40 వేల కోట్ల రుణాలను ఎడుమ చేత్తో చెల్లిస్తాను..’ ఇదీ ఓ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 9 నెలలు కావస్తున్నది. కానీ రైతులను బాకీలను మాత్రం తీర్చలేదు. ఇప్పటివరకు వివిధ హామీల ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు వంద కాదు రెండువందలు కాదు ఏకంగా రూ.25వేల కోట్లకు పైగా బాకీ పడింది. ఇందులో వానకాలం రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రూ.11,475 కోట్లు, రైతు రుణమాఫీ కింద రూ.13 వేల కోట్లు, పంట నష్టపరిహారం కింద రూ.428 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉన్నది. ఈ బాకీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పుడు చెల్లిస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
ఓవైపు వానకాలం పంటల సాగు పూర్తయి. పంటలు కోతకు వచ్చే సమయం వచ్చినా ప్రభుత్వం రైతులకు పెట్టుబడిసాయం అందించలేదు. కేసీఆర్ ప్రభుత్వం పంట సాగు సమయానికి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో టంచనుగా జమ చేసేది. గత వానకాలం పెట్టుబడి సాయాన్ని జూన్ 26న మొదలుపెట్టి ఆగస్టు 23నాటికి పూర్తి చేసింది. 70లక్షల మంది రైతులకు చెందిన 1.53కోట్ల ఎకరాలకు రూ.7624 కోట్లు పంపిణీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీజన్‌కు ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడిసాయం అందిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండు సీజన్లు పూర్తవుతున్నా ఇప్పటివరకు పెంచిన పెట్టుబడి సాయాన్ని రైతులకు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ. 7500 చొప్పున 1.53కోట్ల ఎకరాలకు రూ.11,475 కోట్లు పెట్టుబడి సా యంగా పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు నయాపైసా ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతు భరోసాను ఎగ్గొట్టి అరకొర రుణమాఫీ చేసిన సర్కారు కనీసం పంట నష్టపరిహారం ఇచ్చైనా రైతులను ఆదుకుంటుందని ఆశిస్తే నిరాశే ఎదురైంది. కుండపోత వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా సమాచారం. ప్రభుత్వం మాత్రం ప్రాథమిక అంచనా ప్రకారం 4.25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బనట్టుగా గుర్తించింది. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 10వేల పరిహారం ప్రకటించింది. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులకు తక్షణ సాయం అందించి ఆదుకోవాల్సిన సర్కారు పంటల సర్వే పేరుతో కాలయాపన చేస్తుందని రైతులు విమర్శిస్తున్నారు. ఈ వానకాలం పంటలే కాకుండా యాసంగిలో అంటే ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలకు సుమారు 4వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆ పంటలకు కూడా పంటనష్టపరిహారం ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ లెక్కన ఎకరాకు రూ.10వేల చొప్పున ప్రభుత్వం పరిహారం అందిస్తే రైతులకు రూ. 500 కోట్ల బాకీ పడింది.
రుణమాఫీ చేయకపోవడంతో మేడ్చల్‌లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు చేసి పంటలు వేసిన రైతులకు ప్రభుత్వం భ రోసా ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ సర్కారు మా టలు మాత్రమే చెప్పి చేతులెత్తేసింది. దీంతో రైతుకు భరోసా రాక, రుణమాఫీలేక.. పంటనష్టపరిహారం అందక పుట్టెడు కష్టాల్లో ఉన్నాడు.
ఎన్నికల సమయంలో ఒకే దఫాలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక మూడు దఫాల్లో అరకొరగానే మాఫీ చేశారు. రుణమాఫీ కింద రైతులకు రూ.31వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.18వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి చేతులు దులిపేసుకున్నది. ఇంకా రూ.13 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. ఈ మొత్తం ప్రభుత్వం రైతులకు బాకీ పడినట్టే. ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేయకపోవడంతో రైతులకు కొత్త రుణాలు అందడంలేదు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18వేల కోట్లు మాఫీ చేస్తే.. బ్యాంకులు ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు మాత్రమే తిరిగి రుణాలు ఇచ్చినట్టు మంత్రులే స్వయంగా వెల్లడించారు. ఇటు ప్రభుత్వం, అటు బ్యాంకులు రైతుల రుణాలపై దృష్టి పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.