ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలు అరిగోస పడుతున్నరు. పంట చేతికొచ్చిందన్న సంబురం అటుంచితే నెల దాటినా కేంద్రాల వద్ద పడిగాపుల కష్టం మాత్రం పోలేదని ఆవేదన చెందుతున్నరు. ఒకవేళ పంట కొన్నా కొర్రీల పేరిట కోతలు పెడుతుంటే కండ్ల నుంచి కన్నీటి ధారతో యాతన పడుతున్నరు. ఇంత కష్టం చేసినా పెట్టుబడి మిగులుతుందన్న నమ్మకం పోయి, ఈ ఎవుసం జేసుడు ఎందుకని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఎవుసం ఒక ప్రహసనంగా మారిందని పలువురు రైతులు బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో తమ గోడు చెప్పుకొన్నరు.. వారి మాటల్లోనే..
నాపేరు పద్మ. మాది వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరి ద్వారకపేట. ఇప్పుడయితే పంట పండిచ్చుడెందుకు? కొన్మని బతిలాడుడెందుకని బాధనిపిస్తున్నది. 20 రోజుల బట్టి కొండకు ఎదురుచూసినట్టు జూత్తానం. ఇగరారు.. అగరారు. వడ్లు కొనుడులేదు. అడిగినోళ్లు లేరు. ఇటుమొఖాన చూసినోళ్లు లేరు.
ఒక్క తాటిపత్రి (కవర్) కిరాయి రోజుకు రూ. 20 అట. మొత్తం 20 తాటిపత్రిలు తెచ్చినం. రోజుకు రూ. 400 వాటికే పోతానయి. పొద్దుగాల వచ్చుడు. పొద్దూకిపోవుడు. ఇంటికిపోతే కాలుజెయ్యాడ్తలేదు. గాలిదుమారం వత్తాంది. వానత్తే ఎట్ల అని నిద్రకూడా పడ్తలేదు. బస్తకు మూడు కిలోలు తీస్తరట. ఎందుకు తీస్తరంటే అట్లనే తీస్తమంటున్నరు. తాలు అంటున్నరు. తరుగు అంటున్నరు. మాచ్చర్ (మాయిశ్చర్) అంటున్నరు. అట్ల కొంత. ఇట్ల కొంత. ఎన్నితీర్ల నష్టమో. ఈ ఎవుసం ఎందుకు జేసేది అన్నంత జీష్ట పుడుతాంది. జేయకపోతే ఏం జేయకాల్నని ఈ పనిజేసుడు. ఇంతకుముందు మంచిగ ఉండే. నిరుడు, ఈయేడే ఇంత తిప్పలు. మార్కట్లకుపోతనే మంచిగుండు. బయటపోతే పరదాలు తెచ్చుడు ఉండకపోవు. మార్కట్లపోతే గచ్చుమీద పోత్తిమి అయిపోయేది. మార్కట్ల జాగలేక బయటపోసుకొని ఇబ్బంది పడ్తానం. ఎప్పుడుకాలే అట్ల. ఈసారే జొన్నలు ఉండి అట్లయినయ్. ఎప్పుడు కొంటరో చెప్తలేరు. మాకు మేమే ఎక్కడ పడితే అక్కడే వడ్లుపోసుకుంటానం. అడిగినోళ్లు లేరు. చేసినోళ్లు లేరు. మమ్ములను చూసినోళ్లు లేరు. ఇంకా ఆ రైతుబంధు పడలే. ఎప్పుడు పడ్తదో ఏమో..! కరంట్ అట్లట్లనే వచ్చిపోతాంది. గిన్ని ఇబ్బందులతో రైతులం కూడు తినుడే ఇబ్బందయితున్నది.
నాపేరు నాగేంద్రబాబు.. మాది నిర్మల్ జిల్లా ముజ్గి. నాకున్న మూడెకరాల్లో వరి వేసిన. పంట అమ్ముకొనేందుకు ముజ్గి కొనుగోలు కేంద్రానికి 12 రోజుల కింద తీసుకొచ్చిన. ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కాంటా వేయలె. నాతోపాటు వంద మందికి పైగా రైతులు పంటను ఎప్పుడు కొంటరా? అని ఎదురు చూస్తున్నరు. కొనేటోళ్లను అడిగితే హమాలీలు లేరని, లారీల కొరత ఉందని, త్వరలోనే కొంటమని అంటున్నరు.
పది రోజుల నుంచి కల్లాల్లో వడ్ల కుప్పలపై పారీలు కప్పి కావలి కాస్తున్నం. వానకాలం పంట కోసం దుక్కులు దున్ని ఎరువులు వేసుకోవాలి. వడ్లు పోయేదాకా ఏ పని అయ్యేట్టు లేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి పంటలు అమ్మాలన్నా.. ఎరువులు కావాలన్నా.. రైతులకు అన్నీ తిప్పలే ఉన్నయ్. మొన్న మక్కలు అమ్ముకొనేందుకు నిర్మల్ మార్కెట్ యార్డుల పది రోజులు నెరివడ్డ. ఇప్పుడు వడ్లకూ ఇదే పరిస్థితి. కష్టపడి పండించిన పంటను అమ్ముకొనేందుకే నెల రోజులు పడుతున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇసొంటి కష్టాలు చూడలె. డబ్బులు కూడా ఇంత ఇబ్బంది కాలె. టైంకు పంట కొన్నడు. వడ్ల లారీ పోయిన రెండు, మూడు రోజులకే పైసలు కూడా జమైతుండె. ఇప్పుడు పంట అమ్మిన పైసలు రావాలంటే నెలల పాటు ఎదురుచూసే పరిస్థితి దాపురించింది. ఏప్రిల్ 25న మక్కలు అమ్మిన. దాదాపు నెల రోజులవుతున్నా ఇంకా డబ్బులు రాలె. నాకంటే పది రోజులు ముందు అమ్మిన మా ఊరి రైతులకు కూడా ఇంకా జమ కాలె. ఈ కష్టాలు చూసిన రైతులంతా మళ్లా కేసీఆరే రావాలంటున్నరు.
నాపేరు పార సంపత్. మాది కరీంనగర్ జిల్లా ఆరెపల్లి. నాకున్న మూడెకరాల్లో వరి వేసిన. చేతికొచ్చిన వడ్లను కరీంనగర్ వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 25 తారీకు తెచ్చిన. మాయిచ్చర్ చూసేందుకు పది రోజులు ఆపిన్రు. మళ్లీ పదిరోజుల తర్వాత బర్దాన్ సంచులు ఇచ్చిన్రు. బస్తాలు నింపి పెట్టినం. పదిరోజులకు కాంటాకు వస్తరట. కాంట అయినంక మళ్లీ వడ్లు పోవడానికి పది రోజులు పడుతున్నది.
40 రోజులుగా రోజూ ఊరు నుంచి వచ్చుడు పోవుడు అయితున్నది. మార్కెట్లో రైతులకు ఏం సౌకర్యాలు లేవు. వాతావారణం పొద్దున ఓ రకంగా సాయంత్రం ఓ రకంగా ఉంటున్నది. మొగులు అచ్చినప్పుడు కవర్లు కప్పుడు.. మళ్లీ తీసుడు ఇదే పనయితాంది. గాలి దుమారం వస్తే కవర్లు లేచిపోకుండా ఉండేందుకు ఉరుకులు పరుగులె. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్లో రైతులకు అన్నం పెట్టిన్రు. ఇప్పుడు అన్నం కూడా పెట్టడం లేదు. పొద్దున సద్ది పట్టుకొని వచ్చి రాత్రి వరకు ఉండాలంటే రోజుకు రానుపోను ఖర్చులు అన్నీ కలుపుకొని రూ.500 ఖర్చు అయితాంది. ఇట్ల అయితే రైతులకు ఏమి మిగులుతది? రైతు బతుకు హీనం అయ్యింది. కాంట వేసిన తర్వాత బస్తాలు పోయే వరకు రైతులను కావలి ఉండాలంటున్రు. ఉండక పోతే బత్తాలు ఎత్తుకపోతున్రు. ఇప్పటికే కొంత మంది రైతులవి పోయినవి. పంట పండించిన పాపానికి కుటుంబాన్ని విడిచి పెట్టి రోజుల తరబడి ఇక్కడే ఉండాల్సిన ఖర్మ ఉంది. పంట పండిచడానికి మూడు నెలలు పడితే అమ్మడానికి దగ్గర దగ్గర రెండు నెలలు పడుతున్నది. మా బతుకులు ఆగం అయినయ్. వచ్చుడు సూసుడు పోవుడే తప్ప వెంట వెంట కొనడం లేదు. మార్కెట్లో రోజూ దుఖం వస్తున్నది.
నాపేరు రాజు. మాది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్. రైతుల కష్టం ఈ సర్కార్‌కు పట్టడం లేదు. ఆరుగాలం కష్టం చేస్తనే కానీ నోటి కాడికి బుక్క రాదు. అది మరిచిపోతున్నరు. పంట పండియ్యడానికే అరిగోస పడుతున్నం. ఎరువులు కావాలన్నా, నీళ్లు కావాలన్నా, కరంటు రావాలన్నా ఎన్నో ఇక్కట్లు. ఇప్పుడు చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే అవే ఇబ్బందులు.
పంట కేంద్రానికి తీసుకొచ్చి నెల దాటింది. అయినా తూకం వేస్తలేరు. ఎండ ఎక్కువగా ఉన్నది. వడ్ల కుప్పల కాడ కాపలా ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. వడ్లు ఉన్న చోటే ప్యాలాలుగా మారుతున్నయ్. కేసీఆర్ సారు ఉన్నప్పుడు గిట్ల లేకుండె. ఎప్పటికప్పుడు కాంటాలు పెట్టి, మిల్లులకు తరలించిండ్రు. పైసలు కూడా వెంటవెంటనే వేసిండ్రు. కాంగ్రెస్ అచ్చినంక మళ్ల కష్టాలు మొదలైనయ్. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లలో వేగం పెంచాలి. కాంటాలు వేసి, రైస్‌మిల్లులకు తరలించాలి. లేకుంటే రోడ్డెక్కుడుకొస్తది. పెద్దోళ్లకు వెంటనే పనిచేసే పాలకులు మాలాంటి రైతులను ఇలా ఇబ్బందులు పెడితే మంచిరోజులొచ్చినట్టా..? ఇదేం పద్ధతి. దేశానికి అన్నం పెట్టే రైతులను మంచిగ చూసుకోవాలని మాటల్లో చెప్పి ఆచరణలో మాత్రం నీతి తప్పుతరు. ఇది సరికాదు. వెంటనే పంటనంతా కొనాలి.
నా పేరు పద్మ. మాది జోగుళాంబ గద్వాల జిల్లా చెనుగోనిపల్లి. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చి నెల రోజులైంది. ఇప్పుడు ధాన్యం తూకం వేసిన్రు. ఇంకా ధాన్యం కుప్పల దగ్గరే పడిగాపులు గాస్తున్నం. ధాన్యం కొనుడు ఒక ఎత్తయితే.. దానిని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతున్నది.
రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నరు. పంట సాగు చేయడం ఒక్కటైతే.. దానిని అమ్ముకోవడానికి పానం పోతున్నది. అన్ని పనులు వదులుకొని రోజూ ధాన్యం కుప్పల వద్ద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కొనుగోలు కేంద్రం వద్ద కనీసం టెంట్ కూడా లేదు. తాగునీటి సౌకర్యం లేదు. రైతులు కొనుగోలు కేంద్రాలకు పంట తెచ్చి అమ్ముకోవడం కంటే బయట అమ్ముకోవడం మేలు. బయట అమ్మితే ఇన్ని తిప్పలు రైతులకు ఉండవు. ఎన్నికలప్పుడు మాటలు చెబుతరు. ఎన్నికల తర్వాత ఇబ్బందులు పెడుతరు. గతంలో ధాన్యం కొనుగోలు ఫాస్ట్‌గా అయ్యేది. ఇప్పుడు నత్తనడకన చేస్తున్నరు. తూకంలో మోసం చేస్తున్నరు. తూకం 41.500 కిలోలు వేస్తున్నరు. హమాలీ మాపై రుద్దుతున్నరు. ధాన్యం అమ్ముకుందామంటే రైతులకు అన్నీ కష్టాలె.
దేశానికి వెన్నెముక రైతు అంటరు. అలాంటి రైతును కేసీఆర్ తన పదేండ్ల పాలనలో రాజును చేసిండు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించిండు. కానీ నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు అసలు రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధరే కరువైంది.
మాకు 2ఎకరాల భూమి ఉంది. అందులో ఐదు పుట్ల వడ్లు పండినయ్. ఐకేపీ కేంద్రానికి అమ్మకానికి తీసుకొచ్చి 15రోజులు అవుతున్నా నేటికీ కాంటా వేయలె. మరోదిక్కు కాంటాలు వేస్తున్న వడ్లకు క్వింటాకు రెండు కిలోల చొప్పున కటింగ్ పెడుతున్నరు. వడ్లను మిల్లుకు తరలించాక నీళ్లలో పోసి తాలు ఉన్నదని మోసం చేస్తున్నరు. మిల్లర్ల దగ్గరకు ధాన్యాన్ని తీసుకెళ్లి దాదాపు రెండు, మూడు కిలోలు కటింగ్ చేస్తున్నరు. పంటకు పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. కేసీఆర్ సారు మాకు ధాన్యం అమ్మకాల విషయంలో ఇబ్బందులు పెట్టలేదు.మద్దతు ధర వచ్చి నాలుగు డబ్బులు కండ్ల చూసిన రైతులు ఆనందంగా ఉండేది. నేడు కాంగ్రెస్ సర్కారోళ్లు యూరియా ఇయ్యక, నీళ్లు వదలక, పంటకు ధర చెల్లించకపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రాక ఎంతో ఆవేదన పడుతున్నం.
నాపేరు మిరియాల కృష్ణ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మర్రిగూడెంలోని అన్నపురెడ్డిపల్లి. పాలకులు, అధికారులు, మిల్లర్లు కలిసి మాలాంటి రైతులందరినీ నిలువునా ముంచుతున్నరు. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూస్తున్న.
నేను 8 ఎకరాల్లో వరి వేసిన. 250 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి తెస్తే.. ఇక్కడ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కాంటా వేయిస్తే మిల్లర్లు వసూలు చేయమన్నారని చెప్పి.. క్వింటాకు రూ.100 చొప్పున ముక్కుపిండి మరీ తీసుకున్నరు. ఇవ్వకపోతే ఇబ్బందులు పెడుతున్నరు. కాంట రావడం లేదంటూ మెలిక పెడుతున్నరు. చేతికి డబ్బులిస్తే ధాన్యం ఎత్తుతున్నరు. ఇంతకుమించిన దౌర్భాగ్యం ఎక్కడా ఉండదు. గత ప్రభుత్వంలో ఇలాంటి సమస్య రాలేదు. ఎంత ధాన్యం తీసుకొచ్చినా కొన్నరు. నగదు వెంటనే ఖాతాలో జమ చేసిన్రు. ఇప్పుడు 20 రోజులపాటు కాపలా ఉంటనే కొంటున్నరు. దొడ్డు రకాలకైతే తారం 5 కేజీలు ఇవ్వాల్సిందే. సన్నాలకు క్వింటాకు రూ.100 ఇవ్వడం మామూలై పోయింది.
నాపేరు బైకని మల్లయ్య. మాది సిద్దిపేట జిల్లా ఆకునూరు. వడ్లు అమ్ముకునేందుకు కేంద్రానికి వచ్చి నెల రోజులు అయ్యింది. చేర్యాల దగ్గర్లోని సుందరయ్యనగర్ కేంద్రంలో వడ్లు పోసిన. ఇప్పుడే గన్ని సంచులు ఇచ్చిండ్రు. ఈ రోజు వడ్లు నింపితే కాంటాలు అయ్యే సరికి ఇంకో నాలుగు రోజులు పడుతది. ఇగ లారీలు, మిల్లులో దింపుడు మరో నాలుగు రోజులు.
ఇలాంటి సర్కార్‌ను గతంలో ఎప్పుడు చూడలె. కేసీఆర్ సారు ఉన్నప్పుడు మంచిగుండె. వారం రోజుల్లో వడ్లు పోయేవి, చేతికి పైసలు వచ్చేవి. కల్లాల నుంచి కేంద్రానికి వచ్చిన వడ్లు వెంటనే కాంట వేస్తుండె. వెంటనే మిల్లులకు పోతుండె. అది కదా రైతుకు కావాల్సింది. ఓటీపీ అడిగిన తర్వాత రోజున డబ్బులు పడేది. ఇప్పుడు మాకు చానా కష్టం వచ్చింది. ఇంత ఇబ్బందయితదని అనుకోలె. రైతులమంతా మోసపోయినం. ఎరువులు.. కరంటు.. నీళ్లు.. ఇలా అన్నింటికీ గోస పడే రోజు మళ్లీ పదేండ్ల తర్వాత చూసినం. ఇట్లయితే రైతులు బతుకుడు కష్టమే. రైతులను ఇట్ల గోస పెట్టుడు సర్కార్‌కు మంచిది కాదు. వచ్చిన వడ్లన్నీ వెంటనే కొనాలె. పైసలు కూడా వెంటనే ఖాతాల్లో వేయాలె.