Paddy Procurement | వరంగల్/నల్లగొండ, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం కష్టపడి అన్నదాత పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీకి గురిచేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై హలధారిని నిండా ముంచుతున్నారు. నిబంధనల పేరుతో, గన్నీ సంచులు లేవనే సాకుతో ధాన్యం కాంటాలను వారాల తరబడి కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు, అధికారులు కలిసి రైతులను దోచుకుంటున్నారు.
యాసంగి పంటలో తేమ లేకున్నా.. ఉందన్న సాకుతో తూకంలో కోత పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే 42 కిలోలు తూకం పెట్టి 40 కిలోలు అని రాస్తున్నారు. కాంటా అయిన వడ్లు మిల్లుకు పంపిన తర్వాత మరోసారి దోపిడీ జరుగుతున్నది. తేమ, తాలు పేరుతో రైస్‌మిల్లుల వద్ద ఐదారు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు.
అధికారికంగానే ఈ దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మిల్లర్లకు అధికారులు సహకరిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. మిల్లు వద్ద వేబ్రిడ్జి వేసిన ట్రాక్టర్లకు రసీదు ఇవ్వడం లేదు. ఎన్ని క్వింటాళ్లు అయ్యిందో చూసుకునేందుకు ట్రక్‌షీట్ తేవాలని షరతులు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు చేరిన వడ్ల లోడుకు వెంటనే ట్రక్‌షీట్ ఇవ్వాలి. ట్రక్ షీట్లను మిల్లర్లు తమ వద్ద పెట్టుకుని వారం తర్వాత కోతలు పెట్టి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పంపిస్తున్నారు. దీంతో రైతులు నిండా మునుగుతున్నారు.
ప్రతికూల వాతావరణంతో ఇక్కట్లు
రైతులు వడ్లను పొలం నుంచి కొనుగోలు కేంద్రానికి తీసుకుపోయేందుకు అరిగోస పడుతున్నారు. వడ్లను ఆరబెట్టేందుకు రైతులు బహిరంగ స్థలాల్లో పోస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో ఎప్పుడు పడితే అప్పుడు వానలు పడుతున్నాయి. రోజంతా ఎండిన వడ్లు సాయంత్రం అకస్మాత్తుగా వచ్చే వానలతో పూర్తిగా తడిసిపోతున్నాయి. దీంతో రైతులు పొద్దున ఆరబోయడం, సాయంత్రం కుప్పపోయడం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే వడ్లు, వాటికి అవసరమైన బస్తాలు ఎన్ని అనేది అంచనా లేకపోవడంతో కాంటాలు ఆలస్యమవుతున్నాయి. వడ్ల పరిమాణానికి తగినట్టుగా లారీలను సమకూర్చలేకపోతున్నారు.
బోనస్ అంతా బోగస్..
యాసంగిలోనూ సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం రైతులకు చెల్లింపులు జరుపడం లేదు. వానకాలం వడ్లకు బోనస్ చెల్లించని సర్కారు యాసంగిలోనూ ఇదేవిధంగా వ్యవహరిస్తున్నది. యాసంగిలో సన్నవడ్లను పండించడం కష్టమైన పని. దొడ్డు వడ్ల కంటే సన్నవడ్ల ఉత్పత్తికి ఎక్కువ రోజులు పడుతుంది. పెట్టుబడి సైతం ఎక్కువే. కష్టపడి పండించినా సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంలేదు.
యాసంగిలోనే సన్న వడ్లకు చెల్లించాల్సిన బోనస్ రూ.868.61 కోట్లు పెండింగ్ ఉన్నాయి. యాసంగిలో 70.13 లక్షల టన్నుల వడ్లు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకు కేవలం 34.39 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొనుగోలు చేసింది. పదిహేను రోజుల్లో నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ప్రతికూల వాతావరణంతో ఇప్పటికే ప్రతిరోజూ వానలు పడుతుండటంతో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సమస్య ఆది నుంచీ వేధిస్తున్నది. సరైన సమయంలో లారీలు పంపకపోవడం సమస్యగా మారింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎకడికక్కడ పేరుకుపోతున్నది. జిల్లాలో 5.53 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు రాగా, ఈ నెల 16 నాటికి 5.25 టన్నులు కొనుగోలు చేసినట్టు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందులో ఫైనల్ తూకంతో ట్రక్‌షీట్స్ జనరేట్ అయిన ధాన్యం మాత్రం 4.07 లక్షల టన్నులే కావడం గమనార్హం. కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యంతో పోలిస్తే ట్రక్‌షీట్ నమోదు కాకుండా ఇంకా 1.17 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల వద్ద ఉన్నట్టు స్పష్టమవుతున్నది. కొనుగోలు చేసిన ధాన్యంలోనూ ట్యాబ్‌ఎంట్రీ 4.32 లక్షల మెట్రిక్ టన్నులే పూర్తయ్యింది. జిల్లాలో 74,009 మంది రైతుల నుంచి రూ.1218.37 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే శుక్రవారం నాటికి 52,889 మందికి రైతులకు రూ.903.28 కోట్లను రైతులకు చెల్లించినట్లు అధికారులు చెప్తున్నారు.
తరుగుతో రైతులకు నష్టం
కోతలప్పుడు వానలు వస్తున్నాయి. వడ్లను ఆరబెట్టుడు ఇబ్బంది అవుతున్నది. పచ్చి, తాలు పేరుతో తరుగు తీస్తున్నరు. కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రెండు కిలోల తరుగు కోస్తున్నరు. క్వింటాకు కిలో తరుగు తీస్తే బస్తా బరువు, తాలుకు సరిపోతది. కానీ, 40 కిలోల బస్తాకు రెండు కిలోల తరుగు తీస్తుండటంతో క్వింటాకు ఐదు కిలోలు పోతున్నది. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతున్నది.
– భూక్యా తిరుపతి, కుమ్మరిగూడెతండా, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా
వడ్ల పైసలు ఇంకా రాలే
యాసంగి వడ్లు అమ్మి పది రోజులు దాటింది. కాంటా అయిన మూడు రోజులకే పైసలు పడుతయన్నరు. తర్వాత వారం అన్నరు. పది రోజులు దాటింది. ఇప్పటికీ వడ్ల పైసలు పడుతలేవు. కూలోళ్లకు పైసలు ఇయ్యాలంటే ఇబ్బంది అవుతుంది.
– శ్రీనివాస్, ఉప్పల్, కమలాపూర్ మండలం, హనుమకొండ జిల్లా