నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 27: ‘ధాన్యం కొనే దిక్కు లేదు.. నెల రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నాం.. ఓ వైపేమో మొగులు కమ్ముకొస్తున్నది.. మీకు దండంపెడుతాం సారూ.. మా వడ్లు కొనేలా చూడండి’ అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కన్పించిన అధికారులు, ప్రజాప్రతినిధుల కాళ్లమీద పడి ప్రాధేయపడుతున్నారు. అయినప్పటికీ ఈ సర్కార్‌కు రైతులపై కనికరం లేకుండాపోయింది. ధాన్యం కొనాలంటూ బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపట్టారు.
వడ్లు తూకం వేసి 20 రోజులైనా మిల్లులు, గోదాములకు తరలించడం లేదంటూ నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడా గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ధాన్యం సేకరణ చేపట్టాలని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్లోని నెన్నెల-భీమారం రోడ్డుపై రైతులు బైఠాయించారు. నెల క్రితం వడ్ల కుప్పలు పోసినా కాంటా పెట్టలేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో రైతులు రోడ్లెక్కారు.
ఎల్లారెడ్డి మండలం కల్యాణిలో ఆందోళనకు దిగారు. వానకాలం సమీపిస్తున్నా వడ్లు కాంటా వేయడం లేదని ఆగ్రహించిన నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గేటు వద్ద రాస్తారోకో చేపట్టారు. లారీలు, హమాలీల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌లోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి వద్ద రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర తహసీల్ కార్యాలయం ఎదుట జోగిపేట-నర్సాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. చీక్‌మద్దూర్‌లో కేంద్రానికి వడ్లు తెచ్చి నెలరోజులు దాటినా కొనడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యం కొనాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డితోపాటు రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆగ్రహంతో కొందరు రైతులు రహదారిపైనే ధాన్యాన్ని తగులబెట్టారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి పీఏసీఎస్‌లోని కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డెక్కారు. ధర్నా విషయం తెలుసుకుని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు అక్కడికి రాగా రైతులు వారిని నిలదీశారు. ధాన్యం కొంటరా? చావమంటరా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ధాన్యం ఎందుకు కొనడం లేదని అధికారులను నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట హవేళీఘనపూర్ మండలం సర్దన గ్రామ రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ బస్తాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
లారీలు రాకపోవడంతో మిల్లులకు ధాన్యం బస్తాలు తరలించడం లేదని మండిపడ్డారు. అదనపు కలెక్టర్ నగేశ్ వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్లగూడెం వద్ద భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై రైతులు రోడ్డుపై బైఠాయించారు. నెల రోజులైనా ఇప్పటివరకు కనీసం 30 శాతం ధాన్యం కొనలేదని మండిపడ్డారు. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు.
తూకంలో జాప్యం, లారీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. గాలివానతో వడ్ల కుప్పలపై కప్పిన కవర్లు కొట్టుకుపోతున్నాయని, ధాన్యం తడుస్తుందేమోనని భయమేస్తుందని, వెంటనే కాంటా పెట్టి అన్లోడింగ్ అయ్యేలా చూడాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో సిద్దిపేట-కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. సెంటర్లలో వడ్లుపోసి నెలరోజులు దాటినా కాంటా పెడ్తలేరు.. వెంటనే వడ్లు కొనేలా చూడండి.. అంటూ ఎస్సై గణేశ్‌ను రైతులు వేడుకున్నారు.

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా వలిగొండ మండలం ఏదుళ్లగూడెం వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు

ధాన్యం కొనాలని సంగారెడ్డి జిల్లా హత్నూర తహసీల్దార్ కార్యాలయం ఎదుట జోగిపేట-నర్సాపూర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన చీక్‌మద్దూర్ రైతులు

ధాన్యం తరలిస్తలేరంటూ నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడా గ్రామంలో రాస్తారోకోలో భాగంగా రోడ్డుపై పడుకొని నిరసన తెలుపుతున్న రైతులు