కథలాపూర్/బయ్యారం, జనవరి 3 : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రైతులు యూరియా బస్తాల కోసం ఇక్కట్లు పడుతున్నారు. వరి, మక్కజొన్న పంటల సాగుకు యూరియా అవసరం కాగా, 20 రోజులుగా రాకపోవడంతో నిరీక్షిస్తున్నారు. మండలంలోని భూషణరావుపేట, చింతకుంట గ్రామాల రైతులు యూరియా కోసం మూడు వారాలుగా ఎదురు చూడగా, శుక్రవారం 450 యూరియా బస్తాలు భూషణరావుపేట సహకార సంఘానికి వచ్చాయి. దీంతో రైతులు టోకెన్ల కోసం పోటీపడ్డారు. పలువురికి టోకెన్లు అందలేదు. దీనిపై బాధ్యులను వివరణ కోరగా శనివారం ఒక్కో పాస్బుక్కు ఐదు చొప్పున పంపిణీ చేస్తామని, రైతులు ఎక్కువగా వస్తే నాలుగు ఇస్తామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సహకార పరపతి సంఘంలో సర్వర్ పనిచేయకపోవడంతో యూరి యా పంపిణీకి ఆటంకం ఏర్పడింది.
రైతుభరోసాకు మళ్లీ దరఖాస్తు అసంబద్ధం ; రైతుసంఘం నేతలు పోతినేని, సాగర్
హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలు కోసం రైతులు దరఖాస్తులు చేసుకోవాలనడం అసంబద్ధ నిర్ణయమని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెలువడుతున్న చైతన్యసేద్యం రైతుల మాసపత్రిక 2025 డైరీని శుక్రవారం హైదరాబాద్లో ఆవిషరించారు. అనంతరం వారు మాట్లాడారు. యాసంగి రైతుభరోసాను ఒకవైపు సంక్రాంతికి ఇస్తామని చెప్తూ మరోవైపు క్యాబినెట్ కమిటీ ఈ నెల 5,6,7 తేదీల్లో రైతుల నుంచి దరఖాస్తులు చేసుకున్న వారికే వర్తింపజేస్తామని నిర్ణయించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గ్రామసభలు జరిపి వాస్తవ సాగుదారులను నమోదుచేసి వారందరికీ రైతు భరోసా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తదితరులున్నారు.