యూరియా యాప్ వద్దేవద్దంటూ రైతులు మండిపడుతున్నారు. దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లెక్కుతున్నారు. ‘మాకు చిన్న ఫోన్లే ఉన్నయి. మేము యాప్‌లో ఎట్ల బుక్ చేసుకుంటం?’ అంటూ అధికారులపై తిరగబడుతున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో క్షణాల్లోనే యూరియా స్టాక్ ఖాళీ కాగా కోపంతో రైతు వేదికలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
రామారెడ్డి/నిజాంపేట్/వీర్నపల్లి, జూన్ 20: యూరియా యాప్‌ను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. శనివారం యూరియా దొరక్క కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో రైతులు రైతు వేదికలో ఫర్నిచర్‌ను ధ్వంస చేశారు. యాప్‌ను రద్దు చేయాలని మెదక్ జిల్లా నిజాంపేట, సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో రాస్తారోకో చేపట్టారు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి రైతువేదికలో శుక్రవారం యాప్‌పై అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. తమకు చిన్న ఫోన్లే ఉన్నాయని రైతులు ఈ సందర్భంగా అధికారులతో మొరపెట్టుకున్నారు. రామారెడ్డి, పోసానిపేట్ క్లస్టర్లలో 1,332 బస్తాల యూరియా ఉన్నదని, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రైతువేదిక వద్దకు వస్తే బుక్ చేసిస్తామని అధికారులు సూచించారు. దీంతో రైతులు ఆ సమయానికి పెద్ద సంఖ్యలో రామారెడ్డిలోని రైతు వేదికకు చేరుకొన్నారు. అక్కడ క్షణాల్లోనే స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. దీనిపై అధికారులను నిలదీయగా, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆగ్రహానికి లోనైన రైతులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, ఆందోళనకు దిగారు. జిల్లా అధికారులు వచ్చే వరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. డీఏవో మోహన్‌రెడ్డి వచ్చి రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, తమ వద్ద పెద్ద ఫోన్లు లేవని, తమకు యూరియా ఇవ్వరా? అని నిలదీశారు. యాప్ వద్దని, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ గిరి, డీఏవో, పోలీసుల సూచన మేరకు కర్షకులు ఆందోళన విరమించారు.
రోడ్డెక్కిన రైతులు
యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నిజాంపేటలోని సిద్దిపేట-మెదక్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మా ట్లాడుతూ.. మండలానికి వచ్చిన వెయ్యి యూ రియా సంచులు కొద్ది క్షణాల్లోనే యాప్ ద్వారా బుకింగ్ కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులకు యూరియా యాప్ శాపంగా మారిందని ఆవేదన చెందారు. దాదాపు గంటపాటు రైతులు చేసిన రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఎస్సై రాజేశ్ వచ్చి రైతులను సముదాయించడంతో రాస్తారోకోను విరమించారు. కాగా యాప్‌ను వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. షాప్‌లో లేని యూరియా యాప్‌లో ఎందుకు అంటూ ప్రశ్నించారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.