జనగామ, మే 16 (నమస్తే తెలంగాణ) : రైతులు తమ పంటను కొనుగోలు చేయాలని జనగామ జిల్లా వడ్లకొండలో పోలీసుల కాళ్లపై పడి వేడుకుంటున్న దృశ్యాలు చూస్తుంటే తన గుండె తరుక్కుపోయిందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వడ్లకొండలో అన్నదాతలు పంటను అమ్ముకోవడానికి ఇంతటి దీనస్థితికి చేరుకోవడం వెనుక సర్కార్ వైఫల్యమేనని మండిపడ్డారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని పేర్కొన్నారు.
రెకలుముకలు చేసుకుని పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు రోడ్లపైకి వస్తే వారి సమస్య పరిషరించాల్సిందిపోయి పోలీసులను పంపి అణచివేయడం ఏమిటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. ఏ కొనుగోలు కేంద్రంలోనూ బస్తాలు అందుబాటులో లేవని, వడ్లు కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, ఇప్పటికే లిఫ్ట్ చేసిన ధాన్యాన్ని కూడా అన్లోడ్ చేయకుండా నిల్వ ఉంచుతున్నారని మండిపడ్డారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని పరుగెత్తించి ప్రతి గింజనూ కొనుగోలు చేయిస్తామని హెచ్చరించారు.