కేసముద్రం, ఆగస్టు 16: విద్యుత్తు సరఫరా విషయంలో రైతులు సంతోషంగా లేరని, తరచూ అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదులు చేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని రైతు వేదికలో శుక్రవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామనే విషయాన్ని అధికారులు గుర్తించుకొని చిత్తశుద్ధ్దితో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రుణ మాఫీ విషయంలోనూ రైతులకు స్పష్టత లేదని, సమస్యలు రాకుండా అధికారులు చూసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోని పైప్ లైన్ల లీకేజీ సమస్యలను పరిష్కరించి ప్రజలకు భగీరథ నీటిని అందించాలని ఆదేశించారు. కెనాల్ నీరు ప్రతి చెరువులోకి వచ్చేలా చూడాలన్నారు. వన మహోత్సవం పూర్తిస్థాయిలో జరగడం లేదని, నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చూడాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
కాశీబుగ్గ, ఆగస్టు 16: విధి నిర్వహణలో అసభ్యకరంగా వ్యవహరించిన ఇద్దరు ఎన్పీడీసీఎల్ ఇంజినీర్లను సస్పెండ్ చేసినట్టు ఆ సంస్థ సీఈ (హెచ్చార్డీ అండ్ ట్రైనింగ్) టీ మధుసూదన్ ప్రకటించారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కరెంట్ కోతలు.. అడిగితే బూతులు’ కథనానికి విద్యుత్తు శాఖ అధికారులు స్పందించారు. సంబంధిత అధికారుల తీరుపై విచారణ చేపట్టి సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ సర్కిల్ పరిధిలో ఏఈగా పనిచేస్తున్న ఎం జ్యోతిర్మయినాథ్తోపాటు గొర్రెకుంట సబ్ ఇంజినీర్ డీ నరేశ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్ఈ పీ మధుసూదన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
నాగిరెడ్డిపేట, ఆగస్టు 16: ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు తీగలను సరిచేస్తుండగా ఓ రైతు షాక్‌గురై మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్లో శుక్రవారం చోటుచేసుకున్నది. ఎస్సై మల్లారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. జలాల్పూర్ గ్రామానికి చెందిన చితుకుల (కుర్మ) పోచయ్య (38) గ్రామ శివారులోని తనకున్న ఐదెకరాల భూమిలో ఇటీవల వరి వేశాడు. శుక్రవారం ఉదయం వరుసకు అల్లుడైన రమేశ్‌తో కలిసి పంటకు నీరు పారించేందుకు వెళ్లాడు. బోరు మోటర్లు పని చేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద తెగిపోయిన తీగలను గుర్తించాడు. వాటిని సరి చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. అక్కడే ఉన్న రమేశ్ కేకలు వేయడంతో పక్కనే పొలం వద్ద ఉన్న రైతులు వచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్తు సరఫరా నిలిపివేసి చూడగా అప్పటికే పోచయ్య మృతిచెందినట్టు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.