మాకున్న ఐదెకరాల భూమి ట్రిపుల్ఆర్ రోడ్డులో పోతున్నదని రందివట్టుకున్నది. మొత్తం పొలం రోడ్డులో పోతే మా గతి ఏంగావాలె? మేమెట్ల బతకాలె? భూమికి భూమి ఇచ్చి న్యాయంజెయ్యిండ్రి సారూ
-కర్న కమలమ్మ, బాధితురాలు, రత్నాపూర్ (మెదక్ జిల్లా)
RRR | సిద్దిపేట, జూలై 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నర్సాపూర్/శివ్వంపేట : రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూములు ఇచ్చేది లేదని, ఒకవేళ తప్పదంటే భూమికి భూమి ఇవ్వాలని రైతులు ఎదురుతిరిగారు. తమకు ఆధారంగా ఉన్న కొద్దిపాటి భూములను లాక్కుంటే ఎట్లా బతకాలి అని సర్కారును నిలదీశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామ రైతులు రెడ్డిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. శివ్వంపేట మండలంలోని రత్నాపూర్లో ట్రిపుల్ఆర్ కోసం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.
కొందరు అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. ‘మీ కాళ్లు మొక్కుతం.. మా బతుకులను ఆగం చెయ్యకండి. ఉన్నది పోతే సాగు చేసుకోడానికి గుంటెడు జాగ ఉండదు.. ఒకవేళ తప్పదనుకుంటే మాకు భూమికి భూమి ఇచ్చి న్యాయం చెయ్యండి’ అంటూ బోరున విలపించారు. ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడగా రీజినల్ రింగ్ రోడ్డు కోసం విలువైన పంట భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఉన్న భూమి గుంజుకుంటే మా బతుకులు ఎట్లెల్లాలె? మేము ఏం సాగు చేసుకొని బతకాలె? ఉన్నదే ఎకరం.. అరెకరం. అదీపోతే మా ఆదెరువు ఎట్ల? మా భూములు మాకే ఉండనియ్యండి.. మమ్మల్ని బత్కనియ్యండి’ అంటూ మండిపడుతూనే మరోవైపు అధికారుల కాళ్లావేళ్లాపడ్డారు. పాత అలైన్మెంట్ కాకుండా కొత్తగా చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని, రీజినల్ రింగు రోడ్డు వద్దేవద్దని పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ లైన్, కాళేశ్వరం కాలువ కోసం భూములు కోల్పోయామని వాపోయారు. కలెక్టర్ మోఖామీదకు వచ్చి తమ మొర వినాలని కోరారు. భూమికి భూమి, నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇచ్చేదాకా సర్వే చేయనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
గ్రామ శివారు చెరువు నుంచి రీజనల్ రింగు రోడ్డు వేస్తున్నారని రైతులు చెప్పగా అలాంటిదేమీ లేదని, చెరువులోంచి వెళ్లడం లేదని వివరించారు. రైతులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. రైతుల విన్నపాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆర్డీవో చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కాగా నర్సాపూర్‌లో రెండు రోజులుగా కాళేశ్వరం కాల్వ భూసేకరణ ఆపాలంని రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
నాకున్న ఒకటిన్నర ఎకరం పట్టా భూమి రీజినల్ రింగు రోడ్డులో మొత్తం పోతున్నది. ఉన్నదంతా పోతే మేమెట్ల బతకాలె?. ఇద్దరు పిల్లలను ఎట్ల పోషించాలె. భూమి పోతే మాకు చావే దిక్కు. పురుగుల మందు తాగి సచ్చుడుతప్ప మరోటిలేదు.. మాకు న్యాయం చేయండి. మాకున్న కొద్ది పాటి భూమికి బదులు భూమివ్వండి’
– నీరుడి శంకర్, రత్నాపూర్, శివ్వంపేట మండలం