నమస్తే నెట్వర్క్, జనవరి 6: యూరియా కొరతపై రైతులు భగ్గుమంటున్నారు. వానకాలంలో ఉన్న ఇబ్బందులే ఇప్పుడూ ఉన్నాయని, సర్కార్ ఏం చేస్తున్నదని నిలదీస్తున్నారు. ఎవుసం చేసుకోమంటరా? బంజేసుకోమంటరా? అని ప్రశ్నిస్తున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో యూరియా పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో రైతులు చలిని సైతం లెక్క చేయకుండా మంగళవారం తెల్లవారుజామునే గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట చెప్పులను క్యూలో ఉంచి కార్యాలయ ఆవరణలో తలదాచుకున్నారు.

నర్సంపేట మండలం ఇటుకాలపల్లి రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ భూములు కలిగిన ఆకులతండా, నర్సింగాపురం, ముత్తోజిపేట, గార్లగడ్డతండా, హనుమాన్‌తండా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు యూరియా టోకెన్ల కోసం తెల్లవారుజామునే ఇటుకాలపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద బారులుతీరారు.
మహబూబాబాద్ జిల్లా, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాశా రు. తిమ్మాజిపేటలో నానో యూరియా తీసుకోవాలని అధికారులు ఒత్తిడి తేగా తమకు అవసరం లేదని రైతులు తెగేసి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మం డలం నిజామాబాద్‌లోని ప్రాథమిక వ్యవసాయ సంఘం గోదాంకు 444 బస్తాలు రాగా 300 మందికి పైగా రైతులు ఉదయం నుంచే క్యూలో నిల్చున్నారు. ఆధార్, పాస్ పుస్తకాలను అధికారులకు అందించగా 210 మందికే ఎకరానికి బస్తా చొప్పున పంపిణీ చేశారు.

రోజూ యూరియా కోసం తిరుగుడైతంది. పోయినసారి యూరియా సరిగ్గెయ్యక దిగుబడి రాలే. పెట్టుబడిగూడా లాసయినం. సాయిల్ టెస్టు చేయిస్తే గూడా యూరియా శాతం లేదని వచ్చింది. కట్టుదిట్టం జేసి.. జైలులాగా ఏర్పాట్లు జేసి బస్తాలు ఇచ్చుడేందో అర్థమైతలేదు. మరి గవర్నమెంటు ఎవుసం బంజేసుకోమంటదా? అదన్న సెప్పున్రి.
– దుందిగాల రాజు, రైతు, వెంకటాపూర్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల