సాగు నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి, బిచురాజ్పల్లి, పురుషోత్తమాయగూడెం, తండాధర్మారం, బాల్నీ ధర్మారం గ్రామాల నుంచి వెళ్లే ఆకేరు వాగు ప్రస్తుతం ఎండిపోయింది. గతంలో ఈ వాగు ఆధారంగా సాగునీరు వినియోగించేవారు. నిరుడు అతివృష్టితో వరదలొచ్చి ఆకేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు నిల్వ లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆకేరు వాగులో రైతులు నీటి గుంతలు తీసి పంపుల ద్వారా పంటలను కాపాడుకోవడానికి శ్రమిస్తున్నారు.
మంచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారంలోని పోచమ్మ తండా వాసులు ఆదివారం నిరసనకు దిగారు. ప్రభుత్వం ఇటీవల ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. తండాలో సుమారు 16 ఇండ్లకు 15 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
ఆదివారం ఉగాది పండుగ రోజు కూడా తాగునీరు సరఫరా కాకపోవడంతో కాలనీవాసులు గుండారం – సముద్రలింగాపూర్ ప్రధాన రహదారిపై డ్రమ్ములు, బకెట్లు, బిందెలు అడ్డంగాపెట్టి నిరసన తెలిపారు. గ్రామ కార్యదర్శి దేవరాజును వివరణ కోరగా, మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతులు చేయిస్తున్నందున పోచమ్మతండాలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తండావాసులు డిమాండ్ చేశారు.