హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండేండ్లుగా రైతులు యూరియాతోపాటు ఇతర ఎరువుల కోసం అరిగోస పడుతున్నారు. మరికొన్ని వారాల్లో వానకాలం ప్రారంభం కానున్నది. రైతులకు కావాల్సిన యూరియాలో మూడో వంతు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు యూరియా పంపిస్తే సాధారణంగా ఏంచేస్తారు? వెంటనే లారీల్లో లోడ్ చేసి గోదాములకు తరలిస్తారు. అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసి వానకాలం పంటల నాటికి రైతులకు అందించేలా సిద్ధం చేస్తారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. కంపెనీలు సరఫరా చేసే ఎరువులను దించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది.
రైళ్ల ద్వారా ర్యాక్ పాయింట్లకు వచ్చిన ఎరువుల స్టాక్‌ను గోదాములకు తరలించేందుకు మార్క్‌ఫెడ్ నియమించిన హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నిసార్లు చెప్పినా సంస్థ పట్టించుకోవడం లేదని, లారీల కొరతను సాకుగా చూపుతున్నదని సమాచారం. దీంతో కంపెనీల నుంచి రాష్ర్టానికి వచ్చిన ఎరువులు ర్యాక్ పాయింట్లలోని తాత్కాలిక షెడ్లలోనే మూలుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ డీలర్లు తమ వాటా ఎరువులను వెంటనే తీసుకెళ్తున్నట్టు చెప్తున్నారు. దీంతో కాంట్రాక్ట్ సంస్థకు మార్క్‌ఫెడ్ నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. ఎరువుల తరలింపులో నిర్లక్ష్యానికి కారణం ఏమిటో చెప్పాలని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎరువుల సరఫరాకు తమ వద్ద 20 సొంత లారీలు, 15 అద్దె లారీలు ఉన్నాయని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంటామని టెండర్ సమయంలో సదరు కాంట్రాక్టు సంస్థ పేర్కొన్నది. తీరా ఇప్పుడు తమ వద్ద లారీలు లేవని, అందుకే ఎరువులను తరలించలేకపోతున్నామని చేతులెత్తేసిందట. కంపెనీలు సరఫరా చేసిన ఎరువులను గోదాముల్లో నిల్వ చేయడంతోపాటు జిల్లాలకు పంపిణీ చేసేందుకు రెండేండ్ల కాలానికి మార్క్‌ఫెడ్ సంస్థ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ టెండర్లు పిలిచింది. 22 ర్యాక్ పాయింట్లకు టెండర్లు పిలువగా ఇందులో 21 ర్యాక్ పాయింట్ల టెండర్లను ఒకే కంపెనీ దక్కించుకున్నట్టు తెలిసింది.
కాంట్రాక్ట్ సంస్థలు అవసరమైన సమయంలోనే చేతులెత్తేసే అవకాశం ఉంటుందని ముందుగానే టెండర్లో పలు నిబంధనలను పొందుపరిచారు. సదరు సంస్థ వద్ద కచ్చితంగా సొంత లారీలు ఉండాలని, అద్దె లారీలను కలిగి ఉండాలని పేర్కొన్నది. దీంతో పాటు అవసరమైన సమయంలో లారీలను సమకూర్చేందుకు వీలుగా లారీ అసోసియేషన్ లేఖను సైతం మద్దతుగా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా 21 ర్యాక్ పాయింట్లను దక్కించుకున్న సంస్థకు 20 సొంత లారీలతోపాటు 15 అద్దె వాహనాలు ఉండాలి. అదే విధంగా 25 లారీలకు అసోసియేషన్ లేఖ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయంటూ టెండర్‌ను దక్కించుకున్న సదరు కాంట్రాక్ట్ సంస్థ.. ఇప్పుడు చేతులెత్తేయడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
లారీలన్నీ ధాన్యం కొనుగోళ్లకు మళ్లించారని, అసోసియేషన్ వాళ్లు లారీలు పంపండం లేదని అధికారులకు చెప్పినట్టు తెలిసింది. అసోసియేషన్ లారీలను పక్కన పెడితే 20 సొంత లారీలు, 15 అద్దె లారీలు ఏమైనట్టు, ఎటు పోయినట్టు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత సీజన్లోనూ నిజామాబాద్‌తోపాటు వివిధ జిల్లాల్లో లారీల కొరత కారణంగా యూరియా సరఫరా నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంట్రాక్ట్ సంస్థ ఇప్పుడే ఇలా నిర్లక్ష్యం చూపుతుంటే.. సీజన్ ప్రారంభమైన తర్వాత ఇంకేం చేస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. టెండర్లో పేర్కొన్న విధంగా అవసరమైన లారీలను సమకూర్చాల్సిందేనని, ఎరువులను ఎత్తాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం.
మున్ముందే ఎరువుల కొరత ప్రభుత్వంతోపాటు రైతులను భయపెడుతున్నది. వచ్చే వానకాలంలో యూరియా కొరత తప్పదంటూ ప్రభుత్వం ముందస్తుగానే పరోక్ష హెచ్చరికలు జారీచేస్తున్నది. కంపెనీలు ఎరువులు సరఫరా చేయడం గగనంగా మారింది. వాస్తవానికి రాష్ట్రంలో 4 లక్షల టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీల నుంచి వచ్చిన ఎరువులను వచ్చినట్టు జాగ్రత్తగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేనిపక్షంలో వచ్చే సీజన్లో మరింత ఎరువుల కొరత తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండేండ్లుగా రాష్ట్రంలో ఎరువులకు కటకట తప్పడంలేదు. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు నానా గోస పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాంట్రాక్ట్ సంస్థ కుంటిసాకులు చెబుతూ ఎరువుల తరలింపులో నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కంపెనీలు సరఫరా చేసిన ఎరువులను కాంట్రాక్ట్ సంస్థ ర్యాక్ పాయింట్ల నుంచి తరలించని పక్షంలో, తాత్కాలిక షెడ్ల కింది బస్తాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. కంపెనీలపై అదనపు చార్జీల భారం పడుతుందని అంటున్నారు. ఎరువులు తరలించడంలో జాప్యం చేస్తే కంపెనీలు ఆ ఎరువులను ఇతర రాష్ర్టాలకు తరలించే ప్రమాదం కూడా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే వానకాలంలో రాష్ట్రంలో ఎరువుల సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.