Farmers | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 20: కాంగ్రెస్ సర్కార్ పాలనలో యూరియా కోసం రైతులకు తిప్పలు మళ్లీ మొదలయ్యాయి. ఎరువుల కోసం పీఏసీఎస్ గోదాం వద్ద ఆధార్, పాస్‌బుక్ జిరాక్స్‌లతో రైతన్నలు బారులు దీరాల్సి వస్తున్నది. మళ్లీ పాతకాలం వలే ఎరువుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన వరిపంటకు యూరియా అవసరముండగా, తగినంత సరఫరా లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో యూరియా కోసం సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో సోమవారం గోదాము వద్దకు యూరియా లారీ వచ్చిందన్న సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రాజాపేట మండల వ్యాప్తంగా గత యాసంగిలో 20వేల ఎకరాలు సాగు చేస్తే యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం సరఫరా చేసిందని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సారి చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోయి 10వేల ఎకరాలే సాగు చేసినప్పటికీ రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు.
ఇచ్చే రెండు బస్తాల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మన్నెగూడెం సొసైటీలకు యూరియా లోడ్ రావడంతో రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో ఉండి అవస్థలు పడ్డారు. ఎకరానికి మూడు బస్తాలు మాత్రమే ఇస్తున్నట్టు రైతులు తెలిపారు.
పదేండ్లుగా యూరియా కోసం ఎప్పడూ ఇలా పడిగాపులు కాయలేదు. కేసీఆర్ సర్కార్ రైతులకు అందుబాటులో సరిపడా యూరియా నిల్వలు ఉంచింది. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాలే. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నది. పొద్దున్నే పనులు మానుకొని వస్తే ఇచ్చే రెండు బస్తాలకు అనేక కొర్రీలు పెడుతున్నారు. ఆధార్, పాసు పుస్తకాలు జిరాక్స్ ఉంటేనే ఇస్తామంటున్నారు. రైతులను కాంగ్రెస్ సర్కార్ నానా ఇబ్బందులు పెడుతున్నది.
– ఎస్కే కరీం, రైతు కాశెగూడెం, రాజాపేట మండలం