కడ్తాల్, డిసెంబర్ 30: గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్నవారికి ఎకరాకి రూ.కోటి నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రావిర్యాల ఓఆర్ఆర్ ఫ్యూచర్ సిటీని కలుపుతూ కందుకూర్, కడ్తాల్ మండలాల మీదుగా, ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నది.
మంగళవారం గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సర్వే పనుల కోసం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని ఏక్వాయిపల్లికి జిల్లా రెవెన్యూశాఖ సర్వే అధికారులు పోలీసులతో కలిసి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు అధికసంఖ్యలో అక్కడికి చేరుకుని సర్వే పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. ఎలాంటి సమాచారం అందించకుండా, రైతులు లేకుండా పోలీసులతో వచ్చి భూ సర్వే పనులు ఎలా చేపడుతారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేశారు.