హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి కార్యాచరణ మాత్రం ప్రారంభించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఏ రకాల సన్నాలను సాగు చేయాలో చెప్పకుండా సాగదీయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ నుంచి సన్నాలకు బోనస్ ఇస్తామని, సన్న రకాల జాబితాను వ్యవసాయశాఖ ఇస్తుందని మంత్రులు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి జాబితా విడుదల కాలేదు. ఓవైపు రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తూ తుకాలు(నారు) పోసేందుకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వం ఏఏ సన్న రకాలను సాగు చేయాలనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ సన్నాల జాబితా లేకుండా రైతులు తమ ఇష్టమొచ్చిన రకాలను సాగు చేస్తే కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీరా రైతులు సాగు చేశాక.. ప్రభుత్వం బోనస్ ఇవ్వకుంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు సన్నాల జాబితా కోసం ఎదురు చూస్తున్నారు.
ధాన్యం విత్తనాల్లో ప్రస్తుతం మార్కెట్లో వందల రకాల సన్న రకాల విత్తనాలు ఉన్నాయి. ఇందులో వ్యవసాయ యూనివర్సిటీ విడుదల చేసిన రకాలతో పాటు ప్రైవేటు కంపెనీలు విడుదల చేసిన రకాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఒక్కో జిల్లాకు ఒక్కో వెరైటీ విత్తనాలను రైతులు సాగు చేస్తారు. చింటూ, గంగాకావేరి, హెచ్ఎంటీ, జైశ్రీరాం, సూపర్ అమన్, దస్తరి, పూజ, చిట్టి ముత్యాలు, గోదావరి ఇసుకలు, మైసూర్ మల్లిగ వంటివి ప్రైవేటు కంపెనీల రకాలు. ఈ రకాలన్నీ మిర్యాలగూడ, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో సాగవుతాయి. ఇక బీపీటీ 5204, వరంగల్, జగిత్యాల, ఆర్ఎన్ఆర్ రకాలు వ్యవసాయ యూనివర్సిటీ అందించే రకాలు. ఈ నేపథ్యంలో ఇక్కడే సమస్య ఉత్పన్నమవుతున్నది. వ్యవసాయ శాఖ సన్న రకాల జాబితాలో ప్రభుత్వ వెరైటీలతో పాటు ప్రైవేటు రకాలను కూడా చేర్చుతుందా లేక కేవలం ప్రభుత్వ రకాలనే చేర్చుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ప్రైవేటు రకాలను జాబితాలో చేర్చితే ఆ తర్వాత పంటలో ఏమైనా ఇబ్బంది ఎదురైతే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న వ్యవసాయ శాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అయితే రైతులు ఎక్కువగా బీపీటీ, హెచ్ఎంటీ, జైశ్రీరాం, గంగాకావేరీ, జగిత్యాల సన్నాలు, వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలు వంటి రకాలను సాగు చేస్తారు. అయితే ఈ రకాలకు బహిరంగ మార్కెట్లోనే భారీ డిమాండ్ ఉంటుంది. మిల్లు ర్లు, వ్యాపారులే పొలాల వద్దకు వెళ్లి పచ్చి ధాన్యాన్నే కొనుగోలు చేస్తారు. మద్దతు ధరకు 500-700 వరకు అధిక ధర కల్పిస్తారు. సన్నాల జాబితా ఇస్తుందా లేదా ఒకవేళ ఇస్తే ఏ రకాలు
ఉంటాయనేదానిపై ఆసక్తి ఉంది.
అన్ని రకాల సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే సమస్య లేదు. కానీ ఎంపిక చేసిన వాటికి మాత్రమే బోనస్ ఇస్తామంటే మాత్రం ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కేబినెట్ పూర్తి తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… ‘సన్న రకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న రకాల జాబితాను వ్యవసాయ శాఖ విడుదల చేస్తుంద’ని ప్రకటించారు. అంటే జాబితా రూపొందిస్తున్నారంటే పరిమిత రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రకాల సన్నాలకు ఇవ్వాలనుకుంటే.. జాబితాతో పనేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్యలతో రైతుల్లో అయోమయం నెలకొన్నది.
సన్నాలకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇందుకు సంబంధించి అటు ప్రభుత్వం నుంచి ఇటు వ్యవసాయ శాఖ నుంచి ప్రణాళిక కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సన్నాలను సాగు చేయాలంటూ రైతులకు పిలుపునిచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే రైతులకు సన్నాల సాగులో మెలుకువలు, జాగ్రత్తలు, సాగు విధానాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ సన్న రకం ఎంత దిగుబడి వస్తుంది, పంట కాలం ఎంత ఉంటుంది, ఏ రకానికి ఎలాంటి చీడపీడలు పడతాయి వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి. ఇంకెప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మాత్రం సన్నాల సాగుపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిన దాఖలాలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.