హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యం పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత కారణంగా పత్తి, వరి దిగుబడి 20 నుంచి 30 శాతం తగ్గే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. యూరియా కొరత ఇలాగే కొనసాగితే దిగుబడులు 40 శాతం తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్తున్నారు.
ఈ రెండు పంటలకు సకాలంలో యూరియా వేస్తే పంట ఏపుగా పెరిగి దిగుబడి కూడా పెరుగుతుంది. లేదంటే సమస్యలు తప్పవని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పైరు ఎర్రబారడంతోపాటు చీడపీడలు పీడిస్తాయని చెప్తున్నారు.
యూరియా కొరతతో ఒకవైపు దిగుబడి తగ్గే ప్రమాదం ఉండగా, మరోవైపు రైతులకు చీడపీడల నివారణ ఖర్చు పెరుగుతున్నది. రాష్ట్రంలో ఎకరాకు 23 నుంచి 25 క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. యూరియా కొరత కారణంగా దిగుబడి 30 శాతం తగ్గితే దాదాపు ఏడు క్వింటాళ్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే ఒక్కో రైతు ఎకరాకు సగటున రూ. 17 వేల వరకు నష్టపోతాడు. దిగుబడి తగ్గితే రైతు ఆదాయంలోనూ కోతపడుతుంది. చీడపీడల నివారణకుకు ఖర్చు అదనం అని రైతులు వాపోతున్నారు.