మొగుళ్లపల్లి/నవాబ్‌పేట/వైరాటౌన్/ శాయంపేట, జూలై 19 : యూరియా కోసం రైతులు సొసైటీలు, గోదాములు, దుకాణాల చుట్టూ తిరిగి బేజారవుతున్నారు. పొద్దంతా నిరీక్షించినా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. గోదాములో ఉండాల్సిన యూరియా బస్తాలు ఎటుపోతున్నాయని ప్రశ్నిస్తూ హనుమకొండ జిల్లా శాయంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో మార్కెట్ గోదాములో యూరియాను పంపిణీ చేస్తున్న క్రమంలో రైతులు శనివారం ఉదయం గోదాము వద్దకు చేరుకున్నారు. వెయ్యి బస్తాల యూరియా తెల్లారేసరికి 50 బస్తాలకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి మొగుళ్లపల్లిలో పీఏసీఎస్‌కు శనివారం ఉదయం 5గంటలకే రైతులు అక్కడికి చేరుకున్నారు. చెప్పులను క్యూలో పెట్టి నిరీక్షించారు.
మధ్యాహ్నం వరకు ఎండలో పడిగాపులు కాశారు. అనంతరం వెంటనే సరిపడా యూరియా అందించాలని ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. కాగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలో పోలీస్ పహారా మధ్య యూరియాను రైతులకు పంపిణీ చేశారు. సింగిల్‌విండో కార్యాలయానికి 600 బస్తాల యూరియా రాగా.. విషయం తెలుసుకొన్న పలు గ్రామాల రైతులు మండల కేంద్రానికి చేరుకున్నారు. దీంతో కార్యాలయ ఆవరణలో ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను క్యూలైన్లో నిల్చోబెట్టారు. సగం మందికి అందక నిరాశతో వెనుదిరిగారు. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు పడిగాపులు కాశారు. లారీలో వచ్చిన యూరియా బస్తాలకు నేరుగా రైతులకు పంపిణీ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
పదేండ్లు లేనిది ఇప్పుడేందుకు?: హరిప్రియ
ఇల్లెందు, జూలై 19: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అవస్థ పడుతున్నారని ఇల్లెం దు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆరోపించారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణ వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఎరువుల గోడౌ న్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపారు. కొన్నిరోజులుగా యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. పొద్దున్నే సద్దికట్టుకొని చేను పనులకు వెళ్లాల్సిన రైతులు ఎరువుల కోసం గోడౌన్ల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీ బాబూరావు, ఇల్లెందు ఏడీఏ లాల్చందు, ఏవో సతీశ్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ నిరసనలో ఇల్లెందు, టేకులపల్లి, బయ్యారం, కామేపల్లి మండలాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.