హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో)ల పరిస్థితి. పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యం వీరికి శాపంగా మారుతున్నది. రుణమాఫీ, రైతుభరోసా అందకపోవడంతో రైతులంతా ఏఈవోలను నిలదీస్తున్నారు. తమకెందుకు రుణమాఫీ కాలేదని మాకెప్పుడు రైతుభరోసా వస్తుందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిరోజు సుమారు100 మంది రైతులు ఫోన్లు చేస్తున్నట్టు ఏఈవోలు వాపోతున్నారు. ఓవైపు ఇతర పనులు చేస్తూ.. మరోవైపు రైతుల ఫోన్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దినెలలుగా ఏఈవోలపై పనిభారం అధికంగా పెరిగిపోయింది.
అన్నీ మాపై రుద్దితే..ఏ పనని చేయాలి..?
ప్రభుత్వ, వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల తీరుపై ఏఈవోలు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. అన్ని పనులు తమకే అప్పిగిస్తే.. ఏ పనని చేయమంటారని ప్రశ్నిస్తున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే కోసం ఫీల్డ్కి వెళ్లిన సమయంలో రైతులు ఆఫీసుకు వచ్చి ఫోన్లు చేస్తున్నారని, తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటున్నారు.