కరీంనగర్, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/ వీణవంక): తమ పంటలు, బావులను కాపాడుకునేందుకు స్వయంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి మానేరువాగు పరీవాహక ప్రాంత రైతులే రంగంలోకి దిగారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చేసిన విన్నపాలు, విజ్ఞప్తులు బుట్టదాఖలవుతున్న నేపథ్యంలో ఇసుక దందాను అడ్డుకునేందుకు కదిలారు. అక్రమంగా తవ్వుతున్న క్వారీలోకి వాహనాలు, లారీలు వెళ్లకుండా అడ్డుగా కట్టవేశారు.
క్వారీ ఇలాగే కొనసాగితే మిగిలిన బావులు కూడా ధ్వంసం కావడమేకాదు, భూగర్భజలాలు అడుగంటి నాటేసిన పొలాలు సైతం ఎండిపోతాయన్న ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఇదిలాఉంటే అడ్డుకట్ట తొలగించి తమ దందాను యథేచ్ఛగా సాగించేందుకు క్వారీ యజమానులు కన్నెర్రజేస్తున్నారు. అందుకోసం అంగ, అర్థ బలగాన్ని వినియోగించడానికి పక్కగా ప్రణాళికలు సిద్ధంచేసినట్టు సమాచారం వస్తుండగా, చావో రేవో తేల్చుకోవడానికి మానేరువాగు పరీవాహక ప్రాంత రైతాంగం సిద్ధమైంది.
అడ్డుకట్టవేసిన రైతులు
ఇప్పలపల్లి శివారులోని మానేరువాగులో ఇసుక క్వారీ పేరిట జరుగుతున్న దౌర్జన్యకాండను.. ‘బావులు పూడ్చి.. బోర్లు కూల్చి.. మానేరు ఇసుక దందా!’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ఉన్నతాధికారులు ఆరా తీసినప్పటికీ, క్షేత్రస్థాయి వరకు మాత్రం ఎవరూ వెళ్లిన దాఖలాలు లేవు. ఈ క్వారీ వెనుక అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడమే అందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. అయితే ‘నమస్తే తెలంగాణ’ బావుల పూడ్చివేతను కండ్లకు కట్టినట్టు ఫొటోలతో ప్రచురించడంతో, అందులో నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న చర్చ ప్రస్తుతం అధికారవర్గాల్లో నడుస్తున్నట్టు సమాచారం.
ఇదిలాఉంటే.. స్థానిక అధికారుల నుంచి మొదలు ప్రజావాణి వరకు బాధిత రైతులు కొద్దిరోజులుగా లిఖితపూర్వక ఫిర్యాదులు చేస్తున్నారు. క్వారీ నిర్వాహకులు తమ బావులను కూల్చివేస్తున్నారని, బావులు కూలిపోకుండా పోసుకున్న గాజులను ధ్వంసం చేస్తున్నారని, పైపులను ఇష్టానుసారం తొలగించి డ్యామేజీ చేస్తున్నారని, మోటర్లు కూడా బావుల్లోనే వేసి పూడ్చేస్తున్నారని, తద్వారా తమకు లక్షల రూపాయల నష్టం వాటిల్లుతున్నదని, ఇప్పటికే చాలా బావులను కూల్చివేశారని, మున్ముందు మిగిలిన బావులను కూల్చివేస్తారంటూ ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయినా దీనిపై అధికారులు కదలలేదు. ఇక విసిగి వేసారిన రైతులు.. తాజాగా ఇప్పలపల్లి క్వారీలోకి వాహనాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. ట్రాక్టర్లతో ఇసుకను అడ్డుగా పోయించి, దానిపై పెద్ద బండరాయి, ముళ్ల కంప అడ్డుగా పెట్టారు. ప్రతి గంటకోసారీ ఒక్కో రైతు అటువైపు వెళ్లి, అడ్డువేసిన కట్టను కూల్చకుండా కాపలా కాస్తున్నారు.
కన్నెర్ర జేస్తున్న క్వారీ నిర్వాహకులు
ఇప్పలపల్లి శివారులోని మానేరువాగు క్వారీ నుంచి రోజుకు కొన్ని వేలాది మెట్రిక్ టన్నుల ఇసుకను తోడేస్తూ.. బయటకు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఆ దందాను నిరాటంకంగా కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులకు రైతులు తీసుకున్న నిర్ణయం అడ్డుగా మారింది. దాంతో నిర్వాహకులు రైతులపై కన్నెర్ర జేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిని తొలగించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలుస్తున్నది.
ఇప్పలపల్లి రైతులు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పటికిప్పుడు తీసివేస్తే గొడవ అయ్యే పరిస్థితులున్నాయని, రెండు మూడురోజుల్లో తొలగించడానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అందుకోసం అవసరమైతే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని సైతం వినియోగించే దిశగా అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. రైతులు తమ పంటలు, బావులను కాపాడుకునేందుకు క్వారీకి అడ్డుగా వేసిన అడ్డుకట్టను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన సిద్ధమవుతుండటం, అదే రైతులు రోజుల తరబడి తిరుగుతూ సమస్య పరిష్కరించాలని దరఖాస్తులు చేస్తున్నా అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడాన్ని నిశితంగా పరిశీలిస్తే .. దీని వెనుక మామూళ్ల తతంగం ఎంతలా నడస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
అడ్డకట్ట వేయకపోతే ఆగంకానున్న రైతులు
మానేరువాగులో ఉన్న ఇసుక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ పథకం ప్రకారమే రాష్ట్రంలోని పలువురు కాంట్రాక్టర్లు.. అధికార పార్టీ నాయకుల అండతో క్వారీలను తమ వశం చేసుకుంటారు. క్వారీ ఇచ్చే సమయంలో టీజీఎండీసీతోపాటు జిల్లా స్థాయి సాండ్ కమిటీ అనేక షరతులు పెడుతుంది. కానీ, క్వారీ దక్కించుకున్న నిర్వాహకులు దాదాపు 90% నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే క్వారీని రద్దుచేయాల్సిన టీజీఎండీసీ అధికారులు ముందుగానే మామూళ్ల మత్తుకు అలవాటు పడుతున్నారు. దీంతో క్వారీల పరిధిలో పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నది. లెక్కకు మించి అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా అటువైపు కన్నెత్తిచూడకపోగా సదరు కాంట్రాక్టర్లకే వంతపాడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి మెజారిటీ క్వారీల్లో ఒక మీటర్ లోతు వరకు మాత్రమే ఇసుక తీయాల్సి ఉంటుంది. ఈ నిబంధన కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. కానీ, క్వారీ కాంట్రాక్టర్లు మాత్రం ఎక్కడా ఈ నిబంధన పాటించడంలేదు. ఇష్టారాజ్యంగా లోతుకు వెళ్లి ఇసుక తీస్తూ విక్రయిస్తున్నారు. దీంతో మానేరు వాగు పరిధిలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచే రైతులు సాగునీటి కోసం నానా కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇప్పలపల్లి రైతుల దుస్థితి ఇదే. ఇప్పలపల్లికి చెందిన రైతులు మానేరు వాగు ఆధారంగా బావులు తవ్వుకొని, దాదాపు 500 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నాట్లు పూర్తయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వుతుండటంతో క్వారీ ఎగువ ప్రాంతంలో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఫిబ్రవరి మొదటి వారం నాటికి మొత్తం భూగర్భ జలాలు అడుగంటి, పొలాలు ఎండిపోయి రోడ్డునపడాల్సి వస్తుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలోనే తమ పంటలను కాపాడుకునేందుకు వారు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
విచారణ చేపట్టాలి
చల్లూరు, ఇప్పలపల్లి గ్రామ పంచాయతీలు వేరువేరు. అటువంటప్పుడు చల్లూరు శివారులో క్వారీ ఇస్తే.. మాగ్రామ శివారులో ఇసుక క్వారీ ఎలా నడుపుతారు? ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఇప్పలపల్లి గ్రామంలో చాలామంది రైతులు మానేరు నీటిపై ఆధారపడి సాగు చేసుకుంటారు. ఇప్పుడు ఇష్టానుసారం తవ్వితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలి. ఇప్పలపల్లి గ్రామ పంచాయతీకి, అలాగే రైతులకు న్యాయం చేయాలి.
– శ్రీనివాస్, ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ విజయ భర్త
యాక్సిడెంట్లు అయినా పట్టించుకోరు
రోజుకు వందలాది లారీలు వచ్చి వెళ్తున్నాయి. ఒక్కోసారి రోడ్డు దాటలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అనేక యాక్సిడెంట్లు అయ్యాయి. అయినా ఎవరూ పట్టించుకోరు. ఇటీవల ఓవర్‌లోడ్‌తో ఓ లారీ బోల్తాపడింది. రోడ్లు ఛిద్రమవుతున్నా ఏ అధికారీ పట్టించుకోడు. ప్రధానంగా మా గ్రామ రైతులు మానేరు నీటి ద్వారానే సాగు చేసుకుంటారు. ఈ మానేరు పరీవాహక గ్రామాలైన చల్లూరు, ఇప్పలపల్లి తదితర గ్రామాల్లో మూడు నుంచి నాలుగువేల ఎకరాలు సాగవుతున్నది. ఇష్టానుసారం ఇసుక తీయడంవల్ల.. భూగర్భజలాలు పోయి రైతుల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలి.
– దండి తిరుపతి, ఇప్పపల్లి గ్రామ వార్డు మాజీ సభ్యుడు
ఇప్పలపల్లి క్వారీలో ఎస్ఐ విచారణ

కరీంనగర్, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘బావులు పూడ్చి.. బోర్లు కూల్చి.. మానేరు ఇసుక దందా!’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురించిన నేపథ్యంలో వీణవంక పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ఆవుల తిరుపతి స్పందించారు. రైతులతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఇప్పలపల్లికి చెందిన బాధిత రైతులు ముదుగంటి విజేందర్‌రెడ్డి, కొలిపాక రమేశ్, కొలిపాక సదయ్య, ఎనుగంటి కిరణ్ అక్కడ రైతులకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు.
పూడ్చివేసిన బావులు, తొలగించిన పైపులు, బావిలోనే కప్పేసిన మోటర్లు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్ల రైతులకు ఇప్పటికే జరిగిన నష్టంతోపాటు భవిష్యత్తులో ఏర్పడనున్న ఇబ్బందులను వివరించారు. క్వారీ నిర్వాహకుల వల్ల ఒక్కో రైతు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ఎస్ఐ తిరుపతి మాట్లాడారు. రైతులు చెప్పిన అన్ని అంశాలతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలను మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.