నిజామాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో దళారులు, వ్యాపారులు మాఫియాగా ఏర్పడి ఆమ్చూర్కు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను నిండా ముంచుతున్నారు. క్వింటాకు రూ.20 వేలు మాత్రమే ధర నిర్ణయించి నిలువునా దోచుకుంటున్నారు. నాణ్యతను సాకుగా చూపి కనిష్ఠంగా రూ.8 వే లు మాత్రమే ఇస్తున్నారు.
ఒకరిద్దరికి మాత్రమే రూ.30 వేల వరకు ధర వస్తుండగా.. ఎక్కువ మందికి రూ.20 వేలు కూడా చేతికి రాకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. చేసేది లేక రైతులు ఎంతోకొంతకు అమ్ముకుని.. కూలీల ఖర్చులు, రవాణా చార్జీలు, మామిడి తోటల అద్దెలు మీద పడి తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం మార్కెట్లో దళారులు మోసాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.