Paddy Procurement | మంచిర్యాల, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా.. కాంటా కావడం లేదు. కొనుగోళ్లు ఆలస్యమైతే ఆకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది తూకంలో దోపిడీ చేస్తున్నారు. ధాన్యంలో పొల్లు ఉందని సాకులు చెబుతూ తరుగు ఎక్కువగా తీస్తున్నారు. మిల్లర్లకు లాభం చేకూర్చేలా సిబ్బంది తూకం చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నత్తనడకన కొనుగోళ్లు
ఏప్రిల్ 1న కేంద్రాలను మొదలుపెట్టినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మంచిర్యాల జిల్లాలో 262 కేంద్రాలకుగాను ఆదివారం నాటికి 60 కేంద్రాలే మొదలయ్యాయి. నిర్మల్ జిల్లాలో 203 కేంద్రాలకు 125, ఆసిఫాబాద్ జిల్లాలో 35 కేంద్రాలకు 15, ఆదిలాబాద్‌లో అతి తక్కువగా మూడు కేంద్రాలకుగాను ఏ ఒక్క సెంటర్ కూడా ప్రారంభం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 7104 కేంద్రాలను ప్రారంభించినట్టు చెబుతున్నా.. 2480 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించినట్టు సివిల్ సప్లయ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులెన్నో…
అడపాదడపా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. చాలా కేంద్రాలకు గన్నీ బ్యాగ్‌లు ఇంకా సరఫరా కాలేదు. నిర్మల్ జిల్లాలో ఆదివారమే గన్నీ సంచులు సరఫరా చేశారు. ధాన్యం కొనుగోళ్లు కూడా ఆదివారం మొదలయ్యాయి. ఎట్టకేలకు ధాన్యం కొంటున్నారు అనుకుంటే ఇద్దరి ముగ్గురు రైతుల ధాన్యమే కొని మిగిలిన వారివి ఆపేశారని రైతులు బాధపడుతున్నారు. చేసిన కొనుగోళ్లలోనూ ఐకేపీ సిబ్బంది రైతులను మోసం చేస్తున్నారు.
40 కిలోల తూకం సంచికి బదులు సంచి వేసి జోకాలి… లేకపోతే నలభైన్నర కిలోలు జోకాలి. కానీ చాలా కేంద్రాల్లో 41 కిలోల నుంచి 42 కిలోలు తూకం వేస్తున్నారు. తూకం ఎక్కువ వేయడంతో పాటు ఏ గ్రేడ్ ధాన్యం తెచ్చినా కూడా కామన్ గ్రేడ్‌గానే పరిగణలోకి తీసుకుంటున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మిన ధాన్యం డబ్బులు కూడా ఎప్పుడు బ్యాంక్ ఖాతాల్లో పడుతాయో తెలియడంలేదని రైతులు అంటున్నారు.
లచ్చన్న కష్టం.. జంపన్న పాలు
ఈ చిత్రంలోని రైతు పేరు మాలోతు లక్ష్మణ్. ఈయనిది రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట లకావత్‌తండా. లక్ష్మణ్ నాలుగెకరాల భూమిలో రూ. లక్ష పెట్టుబడి పెట్టి యాసంగి వరి సాగు చేశాడు. దిగుబడి బాగా రావడంతో సర్కారు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తదని సంబురపడ్డడు. 20 రోజుల కిందట వరి కోసి రంగంపేట జంపన్న చెరువు వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. మూడు రోజులు ఆరబెట్టి 48 బస్తాల్లో ధాన్యం నింపిపెట్టిండు.
కాంటా పెడ్తరని కండ్లు కాయలు జేసుకొని పొద్దంతా అక్కడే ఉంటున్నడు. ఇంతలో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షానికి ఎనిమిది బస్తాల ధాన్యం కాలువలో కొట్టుకుపోయి జంపన్న చెరువులో కలిసింది. మిగిలిన 40 బస్తాలు తడిసిముద్దయినయ్. రేపోమాపో కాంటా పెడితే పైసలు చేతికొస్తయనే టైంల చేసిన కష్టం నీళ్లపాలుకావడంతో లబోదిబోమంటున్నడు. సర్కారు తడిసిన వడ్లను కొనుగోలు చేసి న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటున్నడు. – వీర్నపల్లి
41 కిలోలు జోకుతున్నరు
40 కిలోల తూ కం సంచికి.. సంచి తూకం వేసి వడ్లు జోకాలి. కానీ 41 కిలోలు జోకుతుం డ్రు. ఇదేమిటని అ డిగితే అధికారులు జోకమన్నరని చెప్తున్నరు. అధికారులను అడుగుతాం జోకుడు ఆపాలన్నా ఆపడం లేదు. సంచికి సంచి వేసి జోకాల్సినోళ్లు కిలో ఎక్కువ తూకం వేయడం సరికాదు. రైతులు కిలో ఎక్కువ జోకితే క్వింటాలు వడ్లకు సుమారు రెండు కిలోల వరకు లాస్ కావాల్సి వస్తుంది. ఐకేపీ అధికారి కూడా సంచి వేసి జోకాలని కోరితే అధికారులే ఒక కిలో ఎక్కువ జోకమన్నారని, మిల్లర్లు సంచి వేసి జోకితే తీసుకుంటలేరని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో లాసైనా కూడా ధాన్యం అమ్ముకున్నాం.
– ఆకుల వెంకటస్వామి, కొత్తూర్ గ్రామం, మంచిర్యాల జిల్లా
10 రోజులైతంది వడ్లు తెచ్చి..
కొనుగోలు కేంద్రంలోకి వడ్లు తెచ్చిపోసి 10 రోజులు అవుతుంది. ఈ రోజు సం చులు తెచ్చి స్టార్ట్ చేసిండ్రు. ఇద్దరు ము గ్గురు రైతులవి జోకి మిగిలినయ్ రేపు జోకుతమని చెప్పిన్రు. ఒకటే కాంట పెట్టిజోకుతున్నరు. 200 లారీల వడ్లు వచ్చే పెద్ద సెంటర్లో ఒక్క కాంట పెట్టుడేందో అర్థమైతలేదు. పోయినేడు మూడు కాంటాలు, చివరికి అందని టైమ్‌ల నాలుగు కాంటాలు పెట్టి మరీ కొన్నరు. 20 మంది హమాలీలున్నా.. కాంటాలు లేక ఎదురు చూడాల్సి వస్తున్నది. మద్దతుధర బ్యానరే పెట్టలేదు. ఎంత ఇస్తరో తెల్వదు. ఉన్నది చెప్తే కక్ష కట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది.
– అరుగుల మల్లేశ్, ముథోల్ ఎడ్బిడ్, నిర్మల్ జిల్లా