ఆదిలాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ)/వైరాటౌన్ /చింతకాని: కొనుగోలు కేంద్రాలే తెరువలేదు.. పంటలు ఇంకెప్పుడు కొంటారని రైతులు మండిపడుతున్నారు. టా ర్గెట్ పూర్తయ్యిందంటూ శనగలు కొనకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోళ్ల తీరును నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా జైనథ్తోపాటు ఖమ్మం జిల్లా కొణిజర్ల, తల్లాడలో రైతు లు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. యా సంగిలో సాగు చేసిన శనగ, జొన్న పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జైనథ్‌లో రైతులు హైవేపై బైఠాయించారు. గ్రామాలవారీగా శనగ పంట కొనుగోళ్ల షెడ్యూల్ ప్రకటించిన అధికారులు టార్గెట్ పూర్తయ్యిందని కేంద్రాలను మూసివేశారని రైతులు మండిపడ్డారు. ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నామని వాపోయారు.
ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్‌కు పంటను కొనుగోలు చేయాలంటూ వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని రైతుసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఊరూరా మక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు కొణిజర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతు సంఘం నాయకు లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వైరా మార్కెట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగగా.. బీఆర్ఎస్, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చింతకానిలో ఖమ్మం -బోనకల్లు రహదారిపై రాస్తారోకో చేశారు.
దిగుబడులు కొనక ఏం చేస్తున్నట్టు?: సండ్ర
పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం కొనకపోవడం ఏమిటని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తూ రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి ఎందుకు కన్పించడం లేదని నిలదీశారు. ధాన్యం, మక్క కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటుచేసి వెంటనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తొలుత తల్లాడ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై ఆందోళన, అనంతరం తహసీల్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతులను పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ధర్నా అనంతరం తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డికి సండ్ర సహా రైతులు, నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆ తరువాత సొసైటీ కార్యాలయం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని సండ్ర పరిశీలించారు.