Congress Govt | హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ) : ‘పని తక్కువ.. ప్రచారం ఎక్కువ’ ఈ నానుడి కాంగ్రెస్ సర్కారుకు సరిగ్గా సరిపోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీ, రైతుభరోసా అందిన రైతుల వివరాలను ప్రతీ గ్రామంలో మూడు చోట్ల ఫ్లెక్సీలపై ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ జిల్లాల వారీగా టెండర్లు పిలిచింది. ఓ వైపు చాలా పథకాలకు పైసల్లేవని, అమలు అసాధ్యమని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. కానీ కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేయించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి ప్రచార ఆర్భా టం పతాకస్థాయికి చేరిందని ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. రుణమాఫీ, రైతుభరోసా అందక తాము గోస పడుతుం టే పట్టించుకోకుండా.. గొప్పగా అమలు చేస్తున్నట్టు ఊరూరా ప్రచారం చేసుకోవడమేంటని రైతులు మండిపడుతున్నారు.
రుణమాఫీ, రైతుభరోసాపై ప్రచారం చే యాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకో సం భారీమొత్తంలో ఖర్చు చేస్తున్నది. ఫ్లెక్సీల తయారీ కోసం ఏకంగా రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే వ్యవసాయశాఖ నుంచి బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 34,260 ఫ్లెక్సీలను తయారు చేసేందుకు, రూ.1.20 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ప్రభుత్వం దగ్గర పైసల్లేవని, రాష్ట్రం దివాలా తీసిందని తరచుగా చెప్తున్నారు. మరోవైపు ప్రచారానికి కోట్లు ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ, రైతుభరోసా సగమే అమలు చేసి, లక్షల మందిని ఆదుకోకుండా ప్రచారమెందుక ని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.