ఖిలా వరంగల్/మహబూబాబాద్ రూర ల్, డిసెంబర్ 9 : రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారం టూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని జాబితాలు విడుదల చేసినా అందులో తమ పేర్లు లేవంటూ వారు మండిపడుతున్నారు. ఓ వైపు రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెబుతున్నా మాఫీ కాని రైతులు ఇంకా చాలామందే ఉన్నారని వారు అంటున్నారు. రుణమాఫీ కానీ రైతులంతా సోమవారం వరంగల్, మహబూబాబాద్ కలెక్టరేట్ల నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట, మహబూబాబాద్ మండలం మాధవాపురం, కురవి మండలం బంజారాతండా రైతులు ఆ యా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. అర్హులైన తమకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. నెక్కొండ మండలం ఐవోబీలో 1500 మంది రైతుల ఖాతాలు ఉండగా ఇందులో 600 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని వారు పేర్కొన్నారు. మిగతా 900 మందికి అధికారుల తప్పిదంతో మాఫీకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్లు జీ సంధ్యారాణి, వీరబ్రహ్మచారికి వినతి పత్రాలు సమర్పించారు.
రుణమాఫీ కోసం పోస్టుకార్డు ఉద్యమం ; సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల ఉత్తరాలు
కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ.. మాఫీ వర్తించని రైతులు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో రుణమాఫీ వర్తించని రైతులంతా సోమవారం రుణమాఫీతోపాటు రైతు భరోసా ఇవ్వాలని పోస్టుకార్డుపై రాసి సీఎం రేవంత్‌రెడ్డికి పోస్ట్‌చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల కార్యదర్శి కోలేటి ఉపేందర్ మాట్లాడుతూ.. రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. మాఫీ కాని వారు చాలామంది ఉన్నట్టు తెలిపారు. మాఫీ కోసం ఎదురు చూస్తున్న వారు ఊరూరా ఉన్నారని చెప్పారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పిన లెక్క తప్పా లేదా ఇందులో ఏ మైనా కుంభకోణం జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. మాఫీ వర్తించని రైతుల వివరాలు సేకరించి అర్హులైన వారికి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
సర్కార్ కాలయాపన చేస్తున్నది..
2 లక్షల లోపు రుణం తీసుకున్నవారు మా గ్రామంలోనే సుమారు 900 మంది ఉన్నారు. రుణమాఫీకి అర్హులమైనా సర్కారు కాలయాపన చేస్తున్నది. రూ.90 వేలు రుణం తీసుకున్నా మాఫీ కాలేదు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసినం అంటున్నడు.
– వెంకటేశ్, అలంకానిపేట, నెక్కొండ, వరంగల్
రుణమాఫీ కాలేదు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత రుణమాఫీ కాలేదు. ఈ సర్కార్‌తో ప్రజలకు న్యాయం జరుగుతలేదు. రుణ మాఫీ కాలేదని అధికారుల దగ్గరకు పోయి అడిగినా పట్టించుకోవడం లేదు. రుణ మాఫీ కోసం బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగి యాష్ట కొస్తాంది. ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలె.
– గుగులోత్ సునీత, మాధవాపురం, మహబూబాబాద్ జిల్లా