లాతూర్, జూన్ 10: కరువు రాయితీలు, ఇతర ఉపశమన ఆర్థిక ప్రయోజనాలు అందించడంలో జాప్యాన్ని నిరసిస్తూ వందలాది మహారాష్ట్ర రైతులు సోమవారం లాతూర్-అంబేజోగయి హైవేను దిగ్బంధించారు. రెనాపూర్ తహశీల్ను ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ రైతులకు ఇంకా కరువు రాయితీలు అందలేదని ధర్నాకు నాయకత్వం వహించిన షేత్కరీ సంఘటన నాయకుడు గజన్ బొలంగే తెలిపారు. రహదారి దిగ్బంధం రెండు గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా వారు తహశీల్ కార్యాలయ గేటును మూసివేసి నిరసన తెలిపారు.
‘70 శాతానికి పైగా అర్హులైన రైతులకు కరువు రాయితీలు లేదా ఇతర ఉపశమన ప్రయోజనాలు అందలేదు. దీనిపై తహసీల్దార్ వివరణ ఇవ్వాలి. ఇంకా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు వేయలేదో అధికారులు బ్యాంకులను అడగాలి’ అని గజన్ అన్నారు. ఒక హెకార్ట్కు రూ.50 వేల పంట బీమా రాయితీని కూడా రైతులు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 20లోగా కరువు రాయితీలు అందించకుంటే రెనాపూర్ ప్రాంతంలో మరింత పెద్ద ధర్నా నిర్వహిస్తామని రైతు నాయకుడు దత్తాజీ షింగ్డే హెచ్చరించారు.