దండేపల్లి, ఏప్రిల్ 23: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేయకపోవడంపై బుధవారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకేపీ సీసీ కొమురవెల్లిని రైతులు నిలదీశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యం తూకం విషయంలో నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ముందుగా తెచ్చిన వారి ధాన్యాన్ని తూకం వేయకుండా తర్వాత వచ్చినవారి ధాన్యాన్ని తూకం వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తూకం యంత్రాలు తక్కువగా ఉండటంతోనే కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని, గురువారం మరో నాలుగు తూకం యంత్రాలు ఏర్పాటుచేసి కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.