Rythu Bharosa | హైదరాబాద్, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): రైతులందరికి కావాల్సిన రుణమాఫీ కొందరికే అయింది. ఇప్పటికే ఖాతాలో పడాల్సిన రైతు భరోసా పడలేదు.. సరైన వర్షాలు కురువక కాలం సైతం కక్షగట్టింది.. వెరసి రాష్ట్రంలో రైతులు ఆగమైతున్నరు. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం.. రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలి నుంచి కూడా రైతులకు చెప్తున్న మాటలకు, చేస్తున్న పనులకు ఏ మాత్రం పొంతనం ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏ పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయటం లేదు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల్లోనూ కోతలు పెడుతున్నది. దాంతో రైతులను ఆగం చేస్తున్నది.
పంటల సాగుకు పెట్టుబడి సాయంగా అందించాల్సిన రైతు భరోసా(రైతుబంధు) పంపిణీపై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. వానకాలం సాగు దాదాపు పూర్తయింది. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు నయాపైసా పెట్టుబడి సాయం అందలేదు. గత ఏడాది బీఆర్ఎస్ సర్కారు జూన్ 26న రైతుబంధు పంపిణీని ప్రారంభించి ఆగస్టు 23 వరకు రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమచేసింది. దాంతో రైతులకు పెట్టుబడి సాయానికి ఇబ్బంది రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతు భరోసా ఎప్పుడు ఇస్తారనే అంశంపై స్పష్టత కరువైంది. అసలు ఇస్తారా? లేక ఈ సీజన్‌కు మంగళం పాడుతారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రుణమాఫీ చేస్తున్నాం కదా.. ఇంకా రైతుభరోసా ఇవ్వటం ఎందుకని ప్రభుత్వం భావిస్తున్నదా? రైతుభరోసా పైసలను రుణమాఫీ కింద ఇచ్చేసి చేతులు దులుపుకొనే ఆలోచనలో ఉన్నదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవటంతో రైతులు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
అనర్హులకు పెట్టుబడి సాయం అందుతున్నదనే సాకుతో రైతుబంధు పథకంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వివిధ నిబంధనల పేరుతో రైతుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. రైతుల సంఖ్యలో కోతలు పెట్టేందుకు నలుగురు మంత్రులతో సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇస్తుందని, ఈ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి కొత్త విధివిధానాలు రూపొందించి రైతుభరోసా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ కమిటీ ఏర్పాటై 2 నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ కమిటీ నివేదిక లేదు. అసెంబ్లీలో చర్చించిందీ లేదు.
ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తున్న రుణమాఫీ కూడా రైతులకు పూర్తిగా దక్కడం లేదు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. అంటే 50 లక్షల మంది రుణమాఫీకి దూరమయ్యారు. అదేవిధంగా రూ.31 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా చేసింది మాత్రం 18 వేల కోట్లే. అర్హులైన రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వాళ్లంతా ఎవుసం పనులన్నీ వదిలేసి బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలకు దూరమవుతున్న రైతులపై కాలం కూడా కక్ష గట్టిందనే అభిప్రాయాలున్నాయి. గతంతో పోల్చితే ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఈ వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలే తప్ప సాగుకు అవసరమైన సమయంలో వర్షాలు కురవలేదు. దీనికి తోడు కాళేశ్వరంపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్లను ఎత్తిపోయడంలో నిర్లక్ష్యం వహించిందనే విమర్శలున్నాయి. ఆ ప్రభావం సాగుపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత ఏడాదితో పోల్చితే ఈ సీజన్లో సాగు ఏకంగా 8 లక్షల ఎకరాల్లో తగ్గింది. గత ఈ సమయానికి 1.09 కోట్ల ఎకరాలు సాగు కాగా, ప్రస్తుం 1.01 కోట్ల ఎకరాలే సాగు అవుతున్నది. గత ఏడాది మొత్తంగా రికార్డు స్థాయిలో 1.35 కోట్ల ఎకరాల్లో సాగైంది.
పథకాల్లో కోతలు
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాల్లో కోతలు పెడుతున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని, రైతుబంధు ఇస్తామని ప్రకటించి.. ఇప్పుడు మాత్రం అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, కోతల ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు.
సీజన్ ముగుస్తున్నప్పటికీ ఇంకా రైతుబంధు (రైతుభరోసా) ఇవ్వకపోవటంతో రైతుల్లో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం అరకొరగా, అడ్డదిడ్డంగా కోతలతో రుణమాఫీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే రైతుభరోసా ఆపిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతుబంధు సొమ్ముతో రుణమాఫీ చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతుభరోసా కింద కాంగ్రెస్ సర్కారు ఎకరానికి రూ.7,500 చొప్పు న ఇవ్వాలంటే దాదాపు రూ.12 వేల కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం ఈ నిధులను ఆపేసింది. ఆ నిధులతో నే రుణమాఫీ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.