ప్రాజెక్టులు అలాగే ఉన్నా, చాపకింద నీరులా నీళ్లు తరలిపోతున్నయ్. గుట్టుచప్పుడు కాకుండా పొరుగు రాష్ట్రం నీటిని మళ్లించుకుపోతున్నా రాష్ట్రప్రభుత్వం నిద్ర వీడటం లేదు. గత వేసవిలో ఎదురైన నీటి కష్టాల నుంచి రేవంత్ సర్కారు పాఠాలు నేర్వడం లేదు. ఫలితంగా నెలరోజుల్లోనే శ్రీశైలం నుంచి 93 టీఎంసీలు తరలిపోయాయి. మళ్లీ మనకు సాగు, తాగునీటి కటకట తప్పకపోవచ్చు.
Srisailam | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గత ఎండాకాలం అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకపోవడంతో అప్పుడే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయింది. నెల రోజుల్లోనే దాదాపు 93 టీఎంసీలు తరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా బేసిన్ అవతలి ప్రాంతాలకు నిరంతరాయంగా నీటిని తరలిస్తుండటమే ఇందుకు కారణం. దిగువన నాగార్జునసాగర్‌లోనూ అదే దుస్థితి కనిపిస్తున్నది. వెరసి ఈ యాసంగి సీజన్లో మళ్లీ నీటి కష్టాలు తలెత్తే ప్రమాదం పొంచిఉన్నది. ఇంత జరుగుతున్నాకృష్ణా నదీ యాజమాన్య బోర్డు చోద్యం చూస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. నీటిని మళ్లించుకుపోకుండా ఏపీని నిలువరించడం లేదు.
ఇప్పటికే 400 టీఎంసీలకుపైగా తరలింపు
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా అక్టోబర్ 25 నాటికి శ్రీశైలం రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ మట్టం 885 అడుగులకు చేరుకోగా, 215 టీఎంసీలతో కళకళలాడింది. పలుమార్లు క్రస్ట్‌గేట్లను ఎత్తివేశారు. కానీ, నెలలోనే పరిస్థితి తారుమారైంది. యాసంగి సీజన్‌కు నీటివిడుదల ప్రారంభం కాకముందే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అవుతున్నది. నెల వ్యవధిలోనే 93 టీఎంసీల జలాలు తగ్గిపోగా, రిజర్వాయర్‌లోని నీటినిల్వ 122 టీఎంసీలకు పడిపోయింది. ఎన్నడూ లేనివిధంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా 190 టీఎంసీలకుపైగా జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించింది. హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, ముచ్చుమర్రి, మల్యాల తదితర ఎత్తిపోతల ద్వారా కూడా జలాలను తరలిస్తున్నది. నాగార్జునసాగర్ వద్ద కుడికాలువ, పంప్‌హౌజ్ ద్వారా కూడా కృష్ణా జలాలను ఏపీ నిరంతరాయంగా తరలిస్తున్నది. ఆదివారం సాయంత్రం నాటికి పీఆర్పీ నుంచి రెండు వేల క్యూసెక్కులు, సాగర్ కుడికాలువ ద్వారా 9,150 క్యూసెక్కుల జలాలను తరలిస్తూనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటివరకు 400 టీఎంసీలకుపైగా జలాలను ఏపీ పెన్నా బేసిన్‌కు తరలించినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణకు గడ్డు పరిస్థితులే
శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటినిల్వలు వేగంగా తగ్గిపోవడంతో ఈ యాసంగిలోనూ తెలంగాణకు గడ్డుపరిస్థితులు వస్తాయని రైతాంగం, ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని నాగార్జునసాగర్ ఆయకట్టు కోసం 280 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కావాల్సిన 16.5 టీఎంసీలను శ్రీశైలం రిజర్వాయర్ నుంచే విడుదల చేయాల్సి ఉన్నది. శ్రీశైలం నుంచే కల్వకుర్తి లిఫ్ట్‌తోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. కానీ, ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 122 టీఎంసీలే అందుబాటులో ఉండడం ఆందోళనకరం. మరోవైపు ప్రస్తుతం సాగర్‌లో 306 టీఎంసీలే ఉండగా, అందులో ఎండీడీఎల్ స్థాయి వరకు 150 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే నికరంగా సాగర్‌లో కూడా 150 టీఎంసీలే అందుబాటులో ఉండనున్నాయి. ఏపీ సర్కారు అత్యధిక మొత్తంలో కృష్ణాజలాలను బేసిన్ అవతలి ప్రాంతాలకు తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి సాగర్ ఆయకట్టు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఏర్పడిందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చోద్యం చూస్తున్న బోర్డు
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ సర్కారు యథేచ్ఛగా కృష్ణా జలాలను బేసిన్ అవతలికి తరలిస్తున్నా కేఆర్ఎంబీ చోద్యం చూస్తున్నది. భవిష్యత్ తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లోని నీటినిల్వలను పొదుపుగా వినియోగించుకోవాలంటూ 2 రాష్ర్టాలకు లేఖలు రాసి చేతులు దులుపుకున్నది. ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లిస్తున్నా బోర్డు పట్టించుకోవడం లేదు. సాగర్ వద్ద ఏపీ ఆడింది ఆటగా కొనసాగుతున్నది. ఎలాంటి ఇండెంట్ పెట్టకుండానే, ఈ సీజన్లో నీటివాటాల పంపిణీ పూర్తికాకముందే కుడికాలువ ద్వారా మొత్తంగా 9,150 క్యూసెక్కులను తరలించుకుపోతున్నది. నీటిప్రవాహాల రీడింగ్‌ను నమోదు చేయడం లేదు. ఇటీవల ఇదే విషయమై అక్కడ ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.
తెలంగాణ సర్కారు చోద్యం
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి ఎంతమేరకు సాధ్యమైతే అంత కృష్ణా జలాలను తరలిస్తూ, రిజర్వాయర్లను ఏపీ ప్రభుత్వం నింపుకుంటుండగా తెలంగాణ సర్కారు మొద్దు నిద్ర పోతున్నదని రైతులు మండిపడుతున్నారు. ఏపీ ఇప్పటికే 400 టీఎంసీలకు పైగా జాలాలను తరలించగా, తెలంగాణ 150 టీఎంసీలకు మించి తరలించలేదు. కల్వకుర్తి కింద రిజర్వాయర్లను, కాలువలతో అనుసంధానించిన వందల చెరువులను నింపే అవకాశం ఉన్నా తెలంగాణ సర్కారు ఆ పనిచేయని దుస్థితి. సాగర్ ఎడమకాలువ పూర్తిస్థాయి సామర్థ్యం 8 వేల క్యూసెక్కులు కాగా ఐదు వేల క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదు. చెరువులను నింపే అవకాశమున్నా ఆ పని చేయడం లేదని రైతాంగం మండిపడుతున్నది.