Runa Mafi |హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రుణమాఫీకి ముగింపు పలికిందా? మహబూబ్‌నగర్ రైతుపండుగ సభ ద్వారా ప్రభుత్వం ఇదే సందేశం ఇచ్చిందా? అని అన్నదాతల్లో సందేహాలు కలుగుతున్నాయి. రూ.2 లక్షల లోపు వివిధ కారణాలతో రుణమాఫీకాని 3.13 లక్షల మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతుల రుణమాఫీపై ప్రభుత్వం ఊసెత్తలేదు. దీంతో రూ.2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు రుణమాఫీ అవుతుందో లేదోననే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఆ రైతుల సంగతి అంతేనా?
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ మాట్లాడినా… ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసినం అని పదేపదే చెప్తున్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ సర్కారు రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తుందని, అంతకుమించి ఉన్న రుణాల మాఫీ చేయదు అని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రుణమాఫీ అర్హులు 42 లక్షల మంది ఉన్నారని, వీరికి రూ.2 లక్షల చొప్పున రుణమాఫీకి రూ.31వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే లెక్కలు వేసింది. బడ్జెట్లో రూ. 26వేల కోట్లు కేటాయించింది. శనివారం నాటి నాలుగో విడత మాఫీతో కలిపి 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణాలు మాఫీ చేసింది. కేటాయించిన బడ్జెట్లో ఇక మిగిలింది రూ.5384 కోట్లు మాత్రమే. ఇంకా 16.65 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సిన మొత్తం రూ. 10,384 కోట్లు కాగా ఇంకా రూ. 5వేల కోట్లు అదనంగా అవసరం ఉంది. ఈ మొత్తం సర్కారు రైతులకు బాకీ ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు మాత్రం రుణమాఫీ ప్రక్రియ పూర్తియిందనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
రేషన్‌కార్డుపై వీడని చిక్కుముళ్లు
రూ.2 లక్షలలోపు రుణం కలిగి ఉండి రేషన్‌కార్డు లేని వాళ్లు, ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాల్లో తప్పులుదొర్లిన వాళ్లకు ప్రభుత్వం నాలుగో విడతలో రుణమాఫీ చేసింది. ఈ విధంగా సమస్యలుండే రైతుల పట్ల ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. తొలుత చెప్పింది 6.36 లక్షల మంది కాగా ఇప్పుడు 3.13 లక్షల మందికి మాత్రమే మాఫీ చేసింది. ఇందులోనూ 3.23 లక్షల మందికి అన్యాయం జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇవీ రుణమాఫీ లెక్కలు