కొత్త వ్యవసాయ రుణాల మంజూరులో బ్యాంకు మేనేజర్ నిర్లక్ష్యంపై రైతులు మండిపడ్డారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు ఎస్బీఐకి రైతులు నెల రోజులుగా కొత్త రుణాల కోసం తిరుగుతున్నారు. విసుగుచెందిన రైతులు సోమవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మేనేజర్ ప్రవీణ్ మోజేశ్ను నిలదీశారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో వాదనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కృష్ణంరాజు వచ్చి రైతులను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
రుణమాఫీ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల పీఏసీఎస్ ఎదుట సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడు విడతల్లో రుణమాఫీ డబ్బులు వచ్చినా ఏ ఒక్క రైతుకు కూడా మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ కాని రైతుల గురించి పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.