Telangana | మర్రిగూడ, ఫిబ్రవరి 12 : పోలీసులతో భయపెట్టించి భూసేకరణ జరుపుతారా? అంటూ అధికారులపై రైతులు, ప్రజలు మండిపడ్డారు. ప్లాట్లు, ఆర్అండ్ఆర్ ప్యాకే జీ ఇవ్వాలని కోరుతూ ప్రాజెక్టు పనులను అడ్డుకుంటే అధికారులు, ప్రాజెక్టు యజమానులు ఒక్కటై పోలీసులతో భయపెట్టిస్తున్నారని నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం ప్రాజెక్టు కట్ట వద్ద బుధవారం భూనిర్వాసితులు టిప్పర్లను అడ్డుకొని పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు ఖాళీ చేయాలని అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాన్ని ఖాళీ చేయాలని కలెక్టర్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. అలాంటప్పుడు గ్రామాన్ని ఎం దుకు ఖాళీ చెయ్యమంటున్నారని ప్రశ్నించారు. ప్లాట్లు, నష్టపరిహారం అందకుండా ఇండ్లను ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లి బతకాలని నిలదీశారు. గ్రామస్థులను ప్రలోభాలకు గురిచేస్తూ తమ మధ్య గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.