హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను.. అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు. ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. బస్తా యూరియా ధర రూ.266 ఉండగా ప్రైవేటు వ్యాపారులు రూ. 350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఎరువుల డీలర్లు ‘యూరియా బస్తా ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 266కు విక్రయిస్తే మాకు గిట్టుబాటు కాదు.రూ. 388కి అయితేనే విక్రయిస్తాం.. లేదంటే మొత్తం విక్రయాలను బంద్ చేస్తాం’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈ విధంగా వ్యాపారులు యథేచ్చగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నించిన రైతులకు యూరి యా విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి దుస్థితే నెలకొన్నది. ప్రైవేటు వ్యాపారుల దందాను ప్రభుత్వం, అధికారులు నియంత్రించడంలేదని రైతులు మండిపడుతున్నారు. ‘
కమీషన్ల’ కోసమే రైతుల తరపున మాట్లాడటం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.వ్యవసాయశాఖ, సహకార సంఘం, మార్క్ఫెడ్ అధికారులు.. ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై.. బ్లాక్ దందాకు తెరతీసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీలకు రావాల్సిన యూరియా లారీలను దారిమళ్లిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. చాలా చోట్ల సహకార సొసైటీలు, హాకా సెంటర్ల నిర్వాహకులే ప్రైవేటు ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నారని వివరిస్తున్నారు. రైతులు ఇబ్బందులను పట్టించుకోని అధికారులు.. కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపణలు వినిసిస్తున్నాయి. యూరియా విక్రయాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంక్షలు పెడుతూ మాట్లాడటం ఎవరికోసమని రైతులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఒక్కో రైతుకు ఒకే బస్తా పంపిణీ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇక ఒకట్రెండు బస్తాలకు టోకెన్లు తీసుకోవడం, సొసైటీల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయడం వల్ల… పంటను నష్టపోయే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన చెందుతున్నారు.
పర్యవేక్షణ పట్టదు.. అజమాయిషీ లేదు
ఎరువుల విక్రయాలపై మార్క్ఫెడ్, సొసైటీ అధికారులు, ప్రైవేటు డీలర్లపై.. ప్రభుత్వ పర్యవేక్షణ, అజమాయిషీ లేవని రైతులు చెప్తున్నారు. ఇదే ఆసరాగా చేసుకుని.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా బ్లాక్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు సరైన ప్రణాళికతో వ్యవహరిస్తే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని కొందరు అధికారులే వాపోతున్నారు. కేంద్రం నుంచి సరిపడా యూరియా తెప్పించడంలోనూ ప్రభుత్వ పెద్దలు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు విఫలమైతే… వచ్చిన యూరియాను సక్రమంగా గ్రామాలకు తరలించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలమయ్యారని రైతు సంఘాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఎంత అవసరమో తెలియదా?
యూరియా కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ముందే చేతులెత్తేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం కేటాయించిన కోటాను తీసుకురాలేమని భావించిన అధికారులు.. ఇక్కడ సరఫరాకు కోత పెట్టినట్టు రైతు నాయకులు చెప్తున్నారు. నిరుడు ఆగస్టులో 3.28 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది 3.5 లక్షల టన్నులు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ వ్యవసాయశాఖ ఆగస్టులో కేవలం 1.7 లక్షల టన్నుల సరఫరాకు ప్రణాళిక రూపొందించడం అనుమానాలకు తావిస్తున్నదని చెప్తున్నారు. సగం సరఫరా చేయాలని ముందే నిర్ణయించి.. కోత పెట్టారనే విషయం స్పష్టమవుతున్నదని వివరిస్తున్నారు. అది కూడా సరిగ్గా సరఫరా చేయలేదని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటివరకు ఆగస్టులో 1.7 లక్షల టన్నులకుగాను 87వేల టన్నులు రాగా.. అందులోనూ సగమే సరఫరా చేయడం ప్రభుత్వ అసమర్థత, వైఫల్యానికి నిదర్శనమని చెప్తున్నారు.
ఓటేసినందుకు శిక్షిస్తున్నరు
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు రేవంత్రెడ్డి శిక్షిస్తున్నడు. ఈ శిక్ష ఇంకా మూడేండ్లు అనుభవిస్తూ వనవాసం వెళ్లదీయాలి. అప్పటిదాక గిదే గోస పడాలి. రేవంత్రెడ్డి ఎవుసంలో మన్ను పోసే పరిస్థితి తీసుకువచ్చిండు.
-రాజు, మైసమ్మవాగుతండా, సిద్దిపేట
ఒక్క బస్తానే ఇస్తున్నరు
యూరియా చల్లాల్సిన సమయానికి చల్లకపోతే పంట రాదేమో అని బయమైతున్నది. గత ప్రభుత్వంలో ఎన్నిబస్తాలు అయినా దొరికినయి. ఇప్పుడు లైన్లలో నిలబడితే.. ఒక్కరికి ఒక బస్తానే ఇస్తున్నారు.
-లింగయ్య, రైతు, కోహెడ, సిద్దిపేట జిల్లా