హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన అన్న కొడుకు పొన్నం అనూప్‌కుమార్ తమ భూములను చెరబట్టారని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి రైతులు రాగం శ్రీనివాస్, రాగం మోహన్, రాగం రాధ ఆరోపించారు. యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తమకు జరిగిన అన్యాయాన్ని వారు ఏకరువు పెట్టారు. సిద్దిపేట అర్బన్ మండలం రంగధాంపల్లి పరిధిలో (మిట్టపల్లి రెవెన్యూ) తమ కుటుంబానికి 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని బాధిత రైతు రాగం శ్రీనివాస్ వివరించారు. అందులో 974, 975, 978, 979 సర్వేనంబర్లలో 8 ఎకరాల 30 గుంటలు, సర్వేనంబరు 988, 1005, 1006లో 5 ఎకరాల భూమి ఉన్నదని తెలిపారు.
8 ఎకరాల 30 గుంటల్లో తన ముగ్గురు చిన్నాన్నలు, తమ కుటుంబం కలిసి వ్యవసాయం చేసుకుంటున్నామని వివరించారు. ప్రస్తుతం ఆ భూముల ధర రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పారు. వారసత్వంగా వచ్చిన ఆ భూములను తాము ఏండ్లుగా సాగు చేసుకుంటూ వస్తున్నామని, ఆ వివరాలన్నీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. రైతుబంధు సైతం అందుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఆ భూముల ధరలు పెరుగడంతో దానిపై మంత్రి పొన్నం కుటుంబసభ్యుల కన్నుపడిందని తెలిపారు. గతేడాది ఆగమేఘాలపై బాలాజీ రియల్ ఎస్టేట్స్ పేరిట ఫర్మ్ రిజిస్టర్ చేసుకొన్నారని, డైరెక్టర్లుగా ఉన్న మంత్రి అన్న కొడుకు పొన్నం అనూప్‌కుమార్ మరో ఇద్దరు ప్రణవ్, పృథ్వీతో కలిసి ఈ భూములన్నింటినీ అక్రమంగా తమ రియల్ సంస్థలకు మళ్లించారని పేర్కొన్నారు.
దీనిని తమ కుటుంబ పంచాయితీగా చూపించి, తమ తాతకు చెందిన ఇతర వారసులు వారికి ఈ భూములపై హక్కులు ఇచ్చినట్టు తప్పుడు డ్యాకుమెంట్లను సృష్టించి 8 ఎకరాల 30 గుంటల భూమితోపాటు అదనంగా చుట్టుపక్కల ఉన్న కాలనీలకు చెందిన భూములన్నింటినీ కలుపుకొని 16 ఎకరాలు భూభారతిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ భూమి తమదేనంటూ అన్ని ఒరిజినల్ పత్రాలు సమర్పించినా ప్రస్తుత జిల్లా కలెక్టర్ మాత్రం వారి పక్షానే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అదే కలెక్టర్ గతంలో తమకు డ్రిప్ ఇరిగేషన్ కోసం సబ్సిడీని సైతం మంజూరు చేశారని గుర్తుచేశారు. తాము వ్యవసాయం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తించే కలెక్టర్ సబ్సిడీ మంజూరు చేశారని తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జా జరిగితే కేసు పెట్టాల్సిన ఆర్డీవో దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకొంటూ అన్ని రకాల పత్రాలు కలిగి ఉన్న భూ యజమానులమైన తమకు నోటీసులు జారీ చేసి కేసులు పెట్టారని తెలిపారు. కేసు పెట్టడమే ఆలస్యం అక్కడి ఏసీపీ, సీఐలు అర్ధరాత్రి తమ ఇండ్లలోకి వచ్చి తమ కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చి నిరసన తెలుపడంతో అర్ధరాత్రి వదిలారని తెలిపారు.
తమ భూమిలో ఉన్న మైసమ్మ గడ్డను కూలగొట్టి, రేకుల షెడ్డును నిర్మించారని, బీహార్‌కు చెందిన వర్కర్లను కాపలా పెట్టారని రాగం శ్రీనివాస్ ఇతర రైతులు తెలిపారు. మంత్రి పొన్నం, ఆయన సోదరుడు టీపీసీసీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ ఈ వ్యవహారాన్ని వెనుక ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ భూములను తాము దక్కించుకొనేందుకు ఎంతటి న్యాయ పోరాటమైనా చేస్తామని, ప్రత్యక్ష ఉద్యమానికి వెనుకాడేది లేదన్నారు.
వ్యవసాయమే తమకు ఆధారం : రాగం సుజాత వ్యవసాయమే తమ జీవనధారమని, ఇప్పుడు ఆ ఆధారం లేకుండా చేస్తున్నారని బాధితురాలు రాగం సుజాత తెలిపారు. ఈ భూమి తప్ప తమకు ఎలాంటి ఆస్తులు లేవని, వ్యవసాయం, పాలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకున్నానని తెలిపారు. ప్రస్తుతం తమ కుటుంబానికి పొన్నం కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉన్నదని, తమ భూములు తమకు ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆందోళన వ్యక్తంచేశారు.
పేదల భూములను చెరబట్టిన వారికి అండదండలు ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని యాదవ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి రమేశ్ డిమాండ్ చేశారు. పేద యాదవ కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే, వారికి నీడ లేకుండా చేయాలని మంత్రి హోదాలో ఉండి కుట్రలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయనకు మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని స్పష్టంచేశారు. తక్షణమే అక్రమంగా కబ్జా చేసిన భూములను బాధిత రైతులకు తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో ఐక్య యాదవ సంఘాలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో యాదవ సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశ్‌యాదవ్, బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గత 80 ఏండ్లుగా ఆ భూమిలోనే వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నామని బాధితుడు రాగంమోహన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ భూమి తమ తాత, తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికీ అదే భూమిలో వ్యవసాయం చేస్తున్నామని, తమ కుటుంబ పెద్దల దహన సంస్కారాలన్నీ ఆ భూమిలోనే చేశామని తెలిపారు. బీసీ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ యాదవ సామాజిక వర్గానికి చెందిన తమ భూములను అన్యాయంగా లాక్కొనేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వం తమ భూములను ముట్టుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకున్నాడని తెలిపారు. దశాబ్దాలుగా తమ భూమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని, అలాంటి భూమిని ఎలా లాక్కుంటారని నిలదీశారు. తమ జీవనాధారమే ఆ భూమి అని, అది లేకుండాపోతే ఎలా అని ఆవేదన వ్యక్తంచేశారు.