ఎల్లారెడ్డి రూరల్ (నాగిరెడ్డిపేట్), ఏప్రిల్ 24 : తరుగు పేరిట రైస్‌మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం చీనూర్ గ్రామానికి చెందిన రైతులు.. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైసుమిల్లు యజమానులు క్వింటాల్‌కు 7 నుంచి 11కిలోల మేర తరుగు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.