వర్ధన్నపేట : దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలలోని జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. వారి ఆందోళనకు మద్దతు ప్రకటించిన సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు చెందిన చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల కింద ఇప్పటివరకు నీరులేక రైతులు వరి నాట్లు కూడా వేసుకోలేదని చెప్పారు.