ఖమ్మం, ఏప్రిల్ 15 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : రెండు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను అగాథంలోకి నెట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం ఆ కుటుంబాల ఆశలను అడియాశలు చేసింది. స్వేదం చిందించి పండించిన వరి ధాన్యం కళ్లముందు తడిసి ముద్దకావడంతో భీతిల్లిపోయారు. ఇది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్యబంజర, లోకారం గ్రామాలకు చెందిన రైతుల దీనస్థితి. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో కురిసిన వర్షం వేలాది ఎకరాల్లో పంట నూర్చి కుప్పలుగా వేసిన ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో పుల్లయ్యబంజరకు చెందిన బొల్లం రామయ్య, చంద్రకళ దంపతులు కళ్లముందు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి కన్నీంటి పర్యంతమయ్యారు.
గత సంవత్సరంకంటే ధాన్యం దిగుబడి కొంత పెరిగిందని సంతోషించి క్షణకాలం కాకముందే ఈ పరిస్థితి దాపురించడంతో దేవుడిపై భారం వేయడం తప్ప మరేం చేయలేని పరిస్థితి నెలకొందంటూ వాపోయారు. ధాన్యం కల్లాల్లో ఆరబోసి పది రోజులైనా తమ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే పరిస్థితి పుల్లయ్యబంజరలో అనేక మంది రైతులది. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోలేక, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పట్టించుకునేవారు లేక తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని, ప్రకృతి ఏ క్షణంలో ప్రకోపిస్తుందో తెలియక ఆరబోసిన ధాన్యం ముందు కేంద్రాల అధికారుల పిలుపు కోసం నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో జిల్లాలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నేతల చేతుల్లోకి గన్నీ బ్యాగులు వెళ్లడంతో కొనుగోలు కేంద్రాలను వారు శాసించే పరిస్థితి నెలకొన్నది. రైతులకు ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పార్టీ వారికి బస్తాలు ఇవ్వడం, ధాన్యం కొనుగోలుకు ఆంక్షలపై అధికారులు మౌనం వీడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తడిచిన ధాన్యం కొనాల్సిందే: సండ్ర
అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్యబంజర కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులతో కలిసి మంగళవారం ధర్నా నిర్వహించారు. తొలుత కల్లూరు మండలం పుల్లయ్యబంజర, తల్లాడ మండలం గొల్లగూడెంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాయకులతో కలిసి పరిశీలించారు. పుల్లయ్యబంజర కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిచిన రైతులతో మాట్లాడారు. అనంతరం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.20 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో గన్నీ సంచులు కాంగ్రెస్ నాయకులు ఇష్టమైన వారికి ఇస్తున్నారని, మండలంలోని ఓ గ్రామంలో ఖాళీ సంచుల కోసం కాంగ్రెస్ నాయకులు అధికారుల ఎదుటే ఘర్షణ పడ్డారని తెలిపారు. ముగ్గురు మంత్రులున్నా జిల్లాకు ఉపయోగం లేదని మండిపడ్డారు.
వర్షంతో ధాన్యం కొట్టుకుపోయింది..
వరి కోసి కల్లాల్లో ధాన్యం ఆరబోసి 20 రోజులైంది. మిల్లర్ల ఎంపికలో జాప్యం, అకాల వర్షంతో ధాన్యమంతా వరద పాలైంది. తేమ, తరుగు అంటూ ఆలస్యం చేశారు. కేంద్రాల్లో దళారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో రైతులను చులకనగా చూస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సింది పోయి కాలయాపన చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రైతుల బాధ మరెవరికీ రాకూడదు.
-చంద్రకళ, మహిళా రైతు, కల్లూరు
పండిన పంట నీటిపాలు
చేతికొచ్చిన ధాన్యం వరదపాలైంది. వెయ్యి బస్తాల వరకు వరద ధాటికి కొట్టుకుపోయింది. మిగిలిన వడ్లన్నీ తడిశాయి. ఈ వడ్లు ఎండేదెప్పుడు.. కొనేదెప్పుడు. పూర్తిగా ఎండిన వడ్లు కొనడానికే అష్టకష్టాలు, ఇబ్బందులు పెడుతున్నరు. ఈ వడ్లు కొనాలంటే ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పెడ్తరో. అధికారులు చొరవ తీసుకొని వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేస్తే తప్ప ఇప్పట్లో అయ్యే పని కాదు. ఇన్నేళ్లలో ఇంత ఇబ్బంది ఎన్నడూ పడలేదు.
– బొల్లం రామయ్య, రైతు, కల్లూరు వడగండ్లు..
కడగండ్లుగాలివాన బీభత్సంతో నేలరాలిన ధాన్యం
నవాబ్‌పేట/కల్వకుర్తి/వెల్దండ/మూసాపేట, ఏప్రిల్ 15 : మహబూబ్‌నగర్ జిల్లా రుద్రారం, కొండాపూర్, చాకలిపల్లి, కేశవరావుపల్లి, బట్టోనిపల్లితండాలో మంగళవారం కురిసిన వడగండ్ల వానకు చేతికొచ్చిన వరిధాన్యం నేలరాలి అన్నదాతకు తీవ్రనష్టం వాటిల్లింది. రుద్రారంలో 70 ఎకరాలు, కొండాపూర్‌లో 40 ఎకరాలు, చాకలిపల్లిలో 50 ఎకరాలు, కేశవరావుపల్లిలో 30 ఎకరాలు, బట్టోనిపల్లితండాల్లో 40 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. మూసాపేట మండలం వేములకు చెందిన అయ్యమ్మ (50) తన పొలంలో పండించిన వరి ధాన్యంను వేముల శివారులోని కొజెంట్ పరిశ్రమ వద్ద ఉన్న రోడ్డుపై ఆరబోసింది. వర్షం రావడంతో ధాన్యం కుప్పకట్టింది. ఈదురు గాలులు, వర్షంతో ఆమె వాటి నుంచి తప్పించుకునేందుకు వెళ్తుండగా ఓ ఇనుప డబ్బా గాల్లో పల్టీలు కొడుతూ వచ్చి ఆమెపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర పరిధిలో వడగండ్ల వానతో వరి పంటలు దెబ్బతిన్నాయి. ఆకుతోటబావి, మర్రిగడ్డ, మేరోనిగడ్డ, నక్కరి చెరువులో 80 ఎకరాల్లో వరిపంటకు నష్టం చేకూరింది.
తడిసిన ధాన్యం..రైతన్న దైన్యం!
కొనుగోలు కేంద్రంలో వడ్లు రాశి పోసుకుని ఎదురుచూస్తున్న రైతుదంపతులకు అకాలవర్షం కన్నీటి వ్యథను మిగిల్చింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్యబంజరకు చెందిన బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన అంతాఇంతా కాదు. కొనుగోలు కేంద్రానికి తెచ్చి పది రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనలేదని, తీరా వర్షానికి ధాన్యం తడిసిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.