ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల తెలంగాణచౌక్, ఫిబ్రవరి 10 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని కాళేశ్వరం 9వ ప్యాకేజీ కెనాల్ పరీవాహక ప్రాంత రైతులు సాగునీటి కోసం కలెక్టరేట్ బాటపట్టారు. కాలువ నీళ్లు రాక చెరువులు ఎండిపోయి, భూగర్భ జలాలు ఇంకిపోయి విలవిలలాడుతున్న దీన స్థితిలో ఉన్నామని, వెంటనే నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని కోరుతూ మండలంలోని కిష్టునాయక్తండా, రాజన్నపేట, దేవునిగుట్ట తండా, బాకుర్‌పల్లి గ్రామాలకు చెందిన సుమారు 40 మంది రైతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ సందీప్కుమార్ఝాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని మైసమ్మ చెరువును 9వ ప్యాకేజీ కాలువ ద్వారా నీటిని నింపితే అక్కడున్న పంట పొలాలకు నీరందుతుందని కలెక్టర్‌ను కోరారు.