యాచారం, మార్చి 21: రైతులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేస్తారని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత రైతులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ఆధ్వర్యంలో బాధిత రైతులు శనివారం ఎమ్మెల్యేను కలిశారు. యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద ఫార్మా గ్రామాలకు చెందిన బాధిత రైతులు గత నెలలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరగా, త్వరలోనే కలెక్టర్, ఆర్డీవోతో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. నెల రోజులైనా హామీ నేరవేర్చలేదని, కనీసం అధికారులతో సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని వారు గుర్తుచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఫార్మావ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ.. మండలంలోని 2,250 ఎకరాలకు భూమికి సంబంధించి రైతుల పేర్లను ఆన్లైన్ నుంచి తొలగించడంతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. రైతుల పేర్లు ఆన్లైన్లో లేకపోవడంతో పంట రుణాలు రావడంలేదని, కొన్నేండ్లుగా రైతు భరోసా రావడంలేదని, చివరకు యూరియా బస్తాలు కూడా బుక్ కావడంలేదని పేర్కొన్నారు. అధికారులు ఎంత మభ్య పెట్టినా భూములిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే రంగారెడ్డి స్పందిస్తూ ఈ నెల 31న అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే తప్పనిసరిగా కలెక్టర్, ఆర్డీవోతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మరోమారు హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు.