నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 12: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గన్నీ బస్తాలు లియ్యరు.. కాంటా పెట్టరు.. తరుగు పేరిట దోపిడీతో సతమతమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ధర్నాలు, రాస్తారోకోలతోపాటు వినూత్న నిరసనలు చేపట్టారు.
మల్లాపురంలోనూ తగులబెట్టిన రైతులు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తూకంలో మోసాలను నివారించాలని, మిల్లర్ల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం రామారావుపల్లె, పెద్దాపూర్ రైతులు కోరుట్లలో రాస్తారోకో చేశారు. పెద్దగుండు సమీపంలో 63వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూసాంగ్వి రైతులు నిర్మల్-మంచిర్యాల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల చౌరస్తాలో నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. చెన్నాపూర్, చిన్నగొట్టిముక్ల, తిమ్మాపూర్ కొనుగోలు కేంద్రాల్లోకి 20 రోజులుగా ఒక్క లారీ రాకపోవడం శోచనీయమని అన్నారు. ధాన్యం కొనుగోలులో దోపిడీపై కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు.
కడుపు మండి.. పంటకు నిప్పు
మూడు రోజులుగా లారీలు రావడం లేదంటూ ఆగ్రహానికి గురైన రైతులు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో ధాన్యాన్ని తగులబెట్టారు. ‘ఎలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం దేవుడా’ అంటూ ఆ భగవంతుడిని వేడుకుంటూ కన్నీరు పెట్టారు. మండలంలోని నక్కలపల్లి కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చారు. ఆలస్యంగా కాంటా అయినప్పటికి మూడు రోజులుగా లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు ధాన్యాన్ని రహదారిపై వేసి నిప్పంటించారు. ధాన్యం కొనుగోలులో రేవంత్రెడ్డి సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రైతుల ఉసురు ఊకనే పోదని హెచ్చరించారు.
తహసీల్దార్ కాళ్లు మొక్కిన మాజీ కౌన్సిలర్

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలుక గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ సందర్శించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెన్నూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అనిల్ కోటపల్లి తహసీల్దార్ కాళ్లు మొక్కారు.

జగిత్యాల జిల్లా కోరుట్లలో జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు

ఖమ్మం జిల్లా బోనకల్లులో రోడ్డుపై బైఠాయించిన జడ్పీ మాజీ చైర్మన్ కమల్ రాజు, రైతులు

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో చిన్నగొట్టిముక్ల ప్రధానరహదారిపై ధర్నా చేస్తున్న రైతులకు నచ్చజెప్పుతున్న తహసీల్దార్ కమలాద్రి

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రెడ్డిపాలెం రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న రైతులు

కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు