Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోవడం, ప్రభుత్వం పంటలు కొనకపోవడం వారిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. మరీ ముఖ్యంగా మిర్చి, వేరుశనగ పండించిన రైతుల్లో ఆందోళన నెలకొంది. కనీసం పెట్టుబడులు కూడా వెళ్లక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటలు కొనండి మహాప్రభో.. అంటూ రైతాంగం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. మద్దతు ధరతో పంటలు కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.
మార్కెట్లో వేరుశనగ మద్దతు ధర క్వింటాలుకు రూ. 6783 ఉండగా బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు రూ. 6వేల లోపే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే కనీసం రూ. 5వేలు కూడా ధర ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు మిర్చి పంటకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయితే క్వింటాలుకు కనీసం రూ. 15-17వేలు ధర దక్కితే గానీ రైతులకు గిట్టుబాటు కాదు. కానీ మార్కెట్లో కేవలం రూ. 10-11వేలు మాత్రమే ధర పలుకుతున్నది. కొన్ని సందర్భాల్లో ఇది రూ. 9వేలకు కూడా పడిపోతున్నది. ఉమ్మడి ఖమ్మంలో మార్కెట్లకు మిర్చి పోటెత్తగా, మహబూబ్‌నగర్‌లో వేరుశనగ పోటెత్తింది. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా తయారై ధర తగ్గించేశారనే విమర్శలున్నాయి. ధరలను తగ్గించేసి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రైవేటు వ్యాపారులను నిలవరించాలి. కానీ పలు మార్కెట్లలో అధికారులే దగ్గరుండి మరీ ప్రైవేటు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మార్కెట్లో పంటల ధరలు పడిపోయిన సందర్భంలో ప్రభుత్వం రంగంలోకి దిగి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కారు రైతులను గాలికొదిలేసింది. మద్దతు ధరకు పంటల కొనుగోలుకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. కొనుగోళ్ల నెపాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే వేరుశనగ కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నది.
వేరుశనగ కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ దోబూచులాట ఆడుతున్నాయి. మీరు కొనుగోలు చేయాలంటే.. మీరేనంటూ ఇరు సంస్థల అధికారులు తప్పించుకోవడం గమనార్హం. చివరకు కొనుగోలు బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ఇందులో భాగంగానే కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు కేంద్రం అనుమతి వచ్చింది లేదు.. గింజ పల్లీ కొన్నది లేదు. వాస్తవానికి ఆయిల్‌ఫెడ్‌కు వేరుశనగలు అవసరం. ఈ సంస్థ కోల్డ్ఫ్రెస్ ఆయిల్‌ను తయారు చేసి విక్రయిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రైవేటు సంస్థల నుంచి వేరుశనగను కొనుగోలు చేస్తున్నది. ఇందుకు బదులుగా ప్రస్తుతం మార్కెట్లో ధర తక్కువున్న నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేస్తే ఇటు రైతులకు మేలు జరుగుతుంది, కానీ అలాంటి చర్యలేవి ఆయిల్‌ఫెడ్ తీసుకోలేదు. కనీసం మార్క్‌ఫెడ్ సహకారం కూడా తీసుకోవడం లేదు.
ఈ సీజన్లో పత్తి రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. మద్దతు ధర రూ. 7521 ఉండగా మార్కెట్లో రూ. 6వేలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రైతులకు కొంత ఊరట కలిగించేలా సీసీఐ రాష్ట్రంలో మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపట్టింది. అయితే ప్రైవేటు వ్యాపారుల మాదిరిగానే సీసీఐ కూడా కోతలు, కొర్రీలతో రైతులను ఇబ్బంది పెట్టింది. ఇక ఇప్పుడు సాఫ్ట్వేర్ సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు మార్కెట్లలో పత్తి పేరుకుపోయింది. ఈ విధంగా ఈ సీజన్లో మిర్చి, వేరుశనగ, పత్తి, కంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ మాటలు.. ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.