ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కి నేటికి 60 రోజులు. పంటలను కాపాడుకొనేందుకు పనులన్నీ వదులుకొని.. నిద్రాహారాలు మాని యూరియా కోసం అన్నదాతలు రెండు నెలులుగా కుస్తీ పడుతున్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు. తొలకరి వర్షాలు మొదలైనప్పటి నుంచి ఒక్క బస్తా యూరియా కూడా దొరకని రైతులు ఎందరో ఉన్నారు. చిన్నాపెద్దా అంతా ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, జాగారాలు, చెప్పుల క్యూలు, ఎరువుల దుకాణాలపై రాళ్ల దాడులు, పోలీసుల లాఠీచార్జీలు, తోటి రైతులతో కొట్లాటలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): ఒక్క రోజో.. రెండు రోజులో కాదు… ఏకంగా రెండు నెలలు గడుస్తున్నా.. రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తీరడంలేదు. కాంగ్రెస్ సర్కారు పెద్దలు మాటలే చెప్పడం తప్పా.. యూరియా మాత్రం ఇవ్వడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వివిధ రాష్ర్టాలు మాత్రం కేంద్రం నుంచి అవసరైమన యూరియాను తీసుకెళ్తుంటే.. తెలంగాణ సర్కారు మాత్రం సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నదని మండిపడుతున్నారు. తొలకరి వర్షాలు మొదలైనప్పటి నుంచి ఒక్క బస్తా యూరియా కూడా దొరకని రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎరువు కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదని చెప్తున్నారు.
రేవంత్రెడ్డి సర్కారు విఫలం
కేంద్రం నుంచి యూరియా తీసుకురావడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం, మంత్రులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇతర రాష్ర్టాలు ప్రణాళికబద్ధంగా కేంద్రంతో సంప్రదింపులు చేస్తూ యూరియా తెచ్చుకుంటున్నాయని చెప్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వెల్లడించిన ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పలు రాష్ర్టాలకు కేంద్రం కేటాయించిన యూరియాలో 65-75శాతం వరకు సరఫరా పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం మాత్రం కేవలం 55శాతం మాత్రమే తెచ్చుకున్నదని మంత్రి వెల్లడించారు.
ఢిల్లీకి పోలేదు.. యూరియా తేలేదు
కేంద్రం యూరియా ఇస్తలేదని చెప్పడమే తప్పా…. కేంద్రం నుంచి యూరియా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమిటనేది రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ నేతలతో ఎందుకు చర్చించడంలేదని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు రైతులను గాలికి వదిలేసిందనే విమర్శలు గుప్పిస్తున్నారు. యూరియా కొరత ముంచుకొస్తుందని ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రికి, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు మే నెలలోనే తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు.
ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మాట్లాడి, మన కోటా యూరియా తీసుకొచ్చేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ భేటీల కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్రెడ్డి.. ఆ మధ్య ఓ సారి కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిశారు. కానీ పదేపదే ఢిల్లీ వెళ్తున్న ఆయన ఎందుకు ఫాలోఅప్ చేయలేదని రైతుల సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి నామమాత్రంగా లేఖలు రాస్తే ఫలితమేంటని నిలదీస్తున్నారు.
రామగుండంపై ఫ్యాక్టరీపై పట్టింపేది?
రాష్ట్రంలోని రామగుండం ఎరువుల తయారీ ఫ్యాక్టరీ నుంచి మన రాష్ర్టానికి అధిక శాతం యూరియా రావాల్సి ఉంది. సాంకేతిక కారణాలు, రిపేర్లతో ఫ్యాక్టరీ మూడుసార్లు షట్డౌన్ అయింది. దీంతో ఆగస్టు వరకు 1.69 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 1.06 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది. అయినా ప్రభుత్వం ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూరియా కొరత తీవ్రమైన తర్వాత ఆగస్టు 23న ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల భేటీ అయ్యారు. ఇదే పని చాలా ముందు చేయాల్సిందని చెప్తున్నారు.
రాళ్ల దాడులు… లాఠీచార్జీలు
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో చాలా సులభంగా ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాల యూరియా తీసుకొచ్చుకున్న రైతులు.. ఇప్పడు ఒక్క బస్తా కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా విషయంలో ఉమ్మడి రాష్ట్రం నాటి దుర్భర పరిస్థితి మళ్లీ కండ్ల ముందుకొచ్చాంది. మళ్లీ చెప్పులు, పాస్ బుక్కుల లైన్లు దర్శనమిస్తున్నాయి.
అదును దాటితే దిగుబడి నష్టం
యూరియా కొరత పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. యూరియా దొరక్కపోవడంతో పంటలకు యూరియా వేయాల్సిన సమయం మించిపోతున్నది. దీంతో పంటల ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే వరికి రెండుసార్లు యూరియా వేయాల్సింది. కానీ చాలామంది రైతులు ఒక్కబస్తా కూడా చల్లలేదు. మరో 15 రోజుల్లోగా యూరియా చల్లాల్సిన సమయం మించిపోతుంది.
ఆ తర్వాత యూరి యా వేసినా ఫలితం ఉండదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా యూ రియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనే 20-30శాతం దిగుబడులు తగ్గే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. ఇప్పుటికీ యూరియా దొరక్కపోతే.. నష్టం మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారువ్యక్తంచేస్తున్నారు.