నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 15: ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకోడానికి సైతం నానా తిప్పలు పడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ మాటలు చెప్పుడే తప్ప పంట ఉత్పత్తులు కొనడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. లారీల కొరత పేరుతో 20 రోజులుగా వడ్లు కొనడం లేదని నిర్మల్ జిల్లా దస్తురాబాద్ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్‌పూర్‌కు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్‌లోని చౌరస్తా వద్ద రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా చేశారు. సీరియల్ ప్రకారం కాకుండా నచ్చినవారి ధాన్యాన్ని తొలుత కాంటా చేస్తున్నారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట రైతులు మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హమాలీల కొరతతో రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని సిద్దిపేట జిల్లా రాంపూర్‌లో శ్రీనిధి ఇండస్ట్రీస్(రైస్‌మిల్లు) వద్ద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులే హమాలీలుగా మారి ధాన్యం బస్తాలను కిందికి దించారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సొసైటీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి, ఎలాంటి నిబంధనలు లేకుండా మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. కోరుట్ల వ్యవసాయ మార్కెట్‌కు వారం క్రితం ధాన్యం తెచ్చినా తూకం వేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని, తరుగు పేరుతో దోచుకుంటున్నారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్లలో 63వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.
కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనడం లేదంటూ నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని హైవే-167పై రైతులు ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. మక్కలను ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో రైతులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను నిలదీశారు. వంగూరు మండల కేంద్రంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. మక్క రైతులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేను నిలదీశారు. మక్కను కొనవద్దని పీఎం చెప్పారు.. మేమేమి చేయాలని ఎమ్మెల్యే అనడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
చివరకు పోలీసుల పహారాలో ఎమ్మెల్యే కారెక్కి వెళ్లిపోయారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ వద్ద వందకుపైగా మక్కల లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్లు బారులు తీరాయి. సకాలంలో యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వం, పంటలను కొనుగోలు చేయడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడ్డారు. జనగామ జిల్లా జఫర్గడ్-వర్ధన్నపేట ప్రధాన రహదారిపై చెట్ల కొమ్మలు నరికి రోడ్డుపై వేసిన రైతులు మక్కలు దగ్ధం చేశారు. జనగామ మండలం పెంబర్తి వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసనకు దిగారు.