సంగారెడ్డి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలు నుంచి ఫార్మా విలేజ్ బాధిత రైతులు శుక్రవారం విడుదలయ్యారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో జైలులో ఉన్న 17 మంది రైతులు 37 రోజుల తర్వాత జైలు నుంచి బయటకువచ్చారు. గురువారం రాత్రి బెయిల్ పత్రాలు అందడంతో జైలు అధికారులు ఉదయం 8గంటలకు లగచర్ల రైతులను విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన వారిలో రోటిబండతండాకు చెందిన పత్లావత్ వినోద్, బాస్యానాయక్, రాథోడ్ వినోద్, జర్పుల హీర్యానాయక్, పత్లావత్ శ్రీను నాయక్, లగచర్లకు చెందిన ఎదురింటి శివకుమార్, బసప్ప, నీలిరవి, విష్ణువర్ధన్‌రెడ్డి, యాదయ్య, రాఘవేందర్‌యాదవ్, లక్ష్మయ్య, హకీంపేటకు చెందిన దోరమని రమేశ్, దోరమని బాలకిష్టయ్య, మాణిక్యం శ్రీశైలం, పులిచర్లతండాకు చెందిన హీర్యానాయక్, పత్లావత్ ప్రవీణ్‌నాయక్ ఉన్నారు. జైలు గేటు దాటగానే ఎదురుగా కనిపించిన కుటుంబ సభ్యులు, స్నేహితులను చూసి రైతులంతా భావోద్వేగానికి గురయ్యారు. గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
జైలు నుంచి బయటకు వచ్చామన్న ఆనందం, తప్పు చేయకున్నా కాంగ్రెస్ సర్కార్ కటకటాలపాలు చేసిందన్న ఆక్రోశం రైతుల కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ నాయకులు క్రాంతి కిరణ్, శుభప్రద్‌పటేల్, ముఖ్యనేతలు రైతులకు ఘనంగా స్వాగతం పలికారు. రైతులంతా రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ నిరంకుశం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అడుగడుగునా అండగా నిలిచారంటూ బీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్, కేటీఆర్ జిందాబాద్ అని నినదించారు. ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జైపాల్‌నాయక్, నాయకులు గోపీనాయక్, వినోద్నాయక్లు గిరిజన రైతులను సన్మానించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతులతో ఫోన్లో మాట్లాడి, అభినందించారు. జైలు బయట మీడియాతో మాట్లాడుతున్న రైతులను పోలీసులు అడ్డుకుని మరోసారి తమ దురుసుతనాన్ని ప్రదర్శించారు. మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడమేంటని బీఆర్ఎస్ లీగల్‌సెల్ నేతలు ప్రశ్నించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.