వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన రైతు జాన్యా నాయక్ రెండున్నర ఎకరాల్లో వరి నాటాడు. మరో 20 రోజులు నీరందితే వరి చేను చేతికొస్తుంది. ఈ పొలానికి రెండు బోర్లుంటే, ఒకటి పూర్తిగా ఎండిపోగా.. మరో బోరులో నీటిమట్టం తగ్గింది. ఇప్పటివరకు ఎకరంన్నర పొలం వదిలేసిండు. మరో ఎకరా మాత్రమే పచ్చగా ఉన్నది. బోరులో నీరు తగ్గడంతో పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాడు. రోజుకు రెండు ట్రిప్పులు ట్యాంకర్ నీటితో చేనును బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం బాడుగదిన్నెకు చెందిన రైతు బైరపోగు అశోక్‌కు ఆరెకరాల భూమి ఉన్నది. నాలుగెకరాల్లో కంది సాగు చేయగా.. నీళ్లులేక ఎండిపోయింది. మరో రెండు ఎకరాలు బీడు పెట్టాడు. మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకొన్నాడు. ఇందులో ఎకరంన్నరలో నువ్వులు, రెండెకరాల్లో వరి వేశాడు. భూగర్భజలాలు అడుగంటి బోరు నీరు సరిపోవడం లేదు. దీంతో పంటలు ఎండిపోయాయి. వేల రూపాయల పెట్టుబడి పెట్టగా కండ్ల ముందే పంటలు ఎండిపోవడంతో అశోక్ కన్నీరుమున్నీరవుతున్నాడు.
-కోడేరు
నిర్మల్ జిల్లా భైంసాలోని రాహుల్‌నగర్‌లో ఆస్తి పన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు శుక్రవారం కాలనీకి తాగునీటి కనెక్షన్‌ను కట్ చేశారు. దీంతో స్థానికులు వాటర్ ట్యాంకు వద్ద నిరసనకు దిగారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి చర్యలు లేవని తెలిపారు. తాగునీటిని సరఫరా చేయకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
– భైంసా
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలోని వెంగళరావు ప్రాజెక్టు ఎండిపోయింది. ప్రాజెక్టు అలుగుకు మరమ్మతులు చేయించకపోవడంతో నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పదేండ్లుగా పక్కకు పడేసిన ఆయిల్ ఇంజిన్ తీసుకొచ్చి మరమ్మతులు చేయించి ప్రాజెక్టులోని తూటికాడ ఉన్న కొద్దిపాటి నీటిని పొలాలకు పారించుకుంటున్న రైతు బొమ్మకంటి చెన్నారావు.
– చండ్రుగొండ