సంగెం, జనవరి 29 : పంటలు సరిగ్గా పండక, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో పది రోజుల క్రితం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఆగం చేయడంతో ఇంటి పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలోని పోచమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మహారాజ్తండాలో ఈ నెల 19న రైతు బానోత్ తిరుపతి (39) ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఉన్న రెండెకరాల వ్యవసాయ భూమితోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని మూడేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఏడెకరాల్లో మొదలు పత్తిపంట వేసి అది సరిగ్గా పండకపోవడంతో దాన్ని తీసేసి మక్కజొన్న వేశాడు. దానికి కూడా పెట్టుబడి ఎక్కువైంది. ఇలా మూడేండ్లు పంట సరిగ్గా దిగుబడి రాక పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చాలనే బాధతో దిగులు పడుతుండేవాడు. రోజూ ఇంట్లో తన కుటుంబ సభ్యులతో చెబుతూ రోదించేవాడు.
మూడేండ్లుగా రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. మిత్తితో కలిసి ఎక్కువ మొత్తంలో అప్పులు కాగా, వాటిని ఎలా తీర్చాలనే తెలియక కుంగిపోయాడు. ఈ నెల 18న ఇంటి వద్ద పురుగుల మందు తాగి తన వ్యవసాయబావి వద్దకు వెళ్లాడు. అక్కడ వాంతులు చేసుకుంటుండగా చుట్టుపక్కల రైతులు చూసి 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 19న మృతిచెందాడు. పదిరోజులుగా ఆ ఇంట్లో కన్నీటి వ్యథే కనబడుతున్నది. మృతుడికి తల్లిదండ్రులు బానోత్ కేవ్ల, పూరమ్మ, భార్య రజిత, కుమారులు హరీశ్ (పదోతరగతి), చిన్న కుమారుడు జశ్వంత్ (ఆరోతరగతి) ఉన్నారు. బానోత్ తిరుపతి గతంలో ఐదేండ్లపాటు పాలేరుగా పనిచేసి, రెండేండ్లు హమాలీగా పనిచేశాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న గిరిజన రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది.